సీబీఐ చార్జ్‌షీట్‌లో చిదంబరం, కార్తీ

19 Jul, 2018 18:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ ఒప్పందం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గురువారం అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీతో పాటు 10 మంది ప్రభుత్వాధికారులు, ఆరు సంస్థలను చేర్చింది. వీరందరిపై నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్‌ అనుబంధ సంస్థ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌ కంపెనీకి 800 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతులు జారీచేశారు.

కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ అనుమతులకు ప్రతిఫలంగా కార్తీకి సంబంధించిన కంపెనీలకు రూ.1.14 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కాగా, ఈ చార్జ్‌షీట్‌పై జూలై 31న విచారణ జరుపుతానని ప్రత్యేక సీబీఐ జడ్జి ఓపీ సైనీ తెలిపారు. కేంద్రం ఒత్తిడితోనే తనతో పాటు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారుల పేర్లతో సీబీఐ అర్థరహితమైన చార్జ్‌షీట్‌ దాఖలుచేసిందని చిదంబరం మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు