మైనార్టీలు భయంతో బతుకుతున్నారు

8 Oct, 2023 04:28 IST|Sakshi

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

మోదీ సర్కార్‌ హయాంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం 

దేశంలో మత స్వేచ్ఛ లేదు

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్‌లో క్రిస్టియన్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు.

2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్‌ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్‌ సంతోష్‌ రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్‌ఎస్‌తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు.

మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్‌లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు