పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే

2 Nov, 2023 05:47 IST|Sakshi

తమ సభ్యుల ఐఫోన్ల ‘హ్యాకింగ్‌’ ఉదంతంపై విపక్షాల పట్టు

యాక్సెస్‌ నౌ నివేదిక వెనుక విపక్షాల హస్తముందన్న బీజేపీ 

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టస్‌లు లేఖ రాశారు.

స్టాండింగ్‌ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్‌లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్‌చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్‌ సబ్‌స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్‌ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్‌ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యానించారు.  

అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం
గతంలో పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్‌ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే.

ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్‌ ఐఫోన్‌ హ్యాకింగ్‌ అలర్ట్‌లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్‌ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు.   

రక్షణ కలి్పంచండి: లోక్‌సభ స్పీకర్‌కు మొయిత్రా లేఖ
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్‌సభ స్పీకర్‌ బిర్లాను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు.

నిఘాకు రూ.1,000 కోట్లు!
‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్‌ నౌ, సిటిజెన్‌ ల్యాబ్‌ వంటి సంస్థలు సెపె్టంబర్‌లోనే ఇలాంటి యాపిల్‌ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్‌ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్‌లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్‌ ఫైల్స్‌’ పేరిట ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ డిమాండ్‌చేశారు. కాగా, అలర్ట్‌ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్‌ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు