కొనలేం.. కట్టలేం!

28 Jun, 2014 00:27 IST|Sakshi
కొనలేం.. కట్టలేం!

చుక్కలు చూపిస్తున్న సిమెంట్ ధరలు
నెల రోజుల్లో రూ.100కు పైగా పెరిగిన ధర
రవాణా, ఇంధన చార్జీలతో స్టీల్, ఇసుక కూడా..
ఫ్లాట్ల ధరలను పెంచే యోచనలో బిల్డర్లు
దీంతో సామాన్యులకు దూరమవుతున్న సొంతిల్లు

 
‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా ఉంది నిర్మాణ రంగ పరిస్థితి. ఏడాదికాలంగా స్థిరాస్తి కొనుగోళ్లు లేక, బ్యాంకులు రుణాలు మంజూరు చేయక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ నిర్మాణ రంగానికి తాజాగా సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరీ ఎక్కువగా నెల రోజులుగా రూ.100కు పైగా పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లకు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నిర్మాణ సంస్థలన్నీ ఒక్క తాటిపైకొచ్చి చ.అ. ధరను రూ.200 లకు పైగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. అంటే సొంతంగా గూడు కట్టుకుందామనుకునే సామాన్యుడికి ఓ పక్క నిర్మాణ సామగ్రి ధరలు చుక్కలు చూపిస్తుంటే.. మరోపక్క అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ తీసుకుందామంటే చ.అ. ధరలు భారంగా మారాయన్నమాట. ఎటొచ్చీ నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల సామాన్యులకే గుదిబండగా మారింది.

 సాక్షి, హైదరాబాద్:  సరిగ్గా నెల క్రితం.. సిమెంట్ (50 కిలోలు) ధర రూ.240-260గా.. అలాగే టన్ను స్టీలు రూ.44-45 వేలుగా, ట్రాక్టర్ ఇసుక రూ.4,400 లుగా ఉండేది. కానీ, ప్రస్తుతం సిమెంట్ ధర రూ.315 అయ్యింది. కొందరైతే రూ.350కి కూడా అమ్ముతున్నారు. ఇక స్టీలు ధర రూ.46-47 వేలుంటే, ఇసుక రూ.4,500లు పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ వాహనాల ప్రవేశ పన్నులు విధించడం, మరోవైపు రైల్వే సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం, ఇంధన వనరుల ధరలూ ఇదే బాటలో పయనించడం వంటి కారణాలతో నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి.

 27 రోజుల్లో రూ.105 భారం: జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో 210 ఉంది. రాష్ట్ర విభజన 2వ తేదీన జరగ్గా 3వ తేదీన బస్తాకు రూ.50 పెంచి రూ.260 చేశారు. 7వ తేదీ నుంచి ఇంకో రూ.25 పెంచి రూ.285కి చేర్చారు. 19వ తేదీన మరో రూ.10 పెంచి రూ.295కు తీసుకెళ్లారు. తాజాగా మరో రూ.20 భారం వేసి బస్తాను రూ.315 విక్రయిస్తున్నారు. అంటే 27 రోజుల్లో సిమెంట్ బస్తాపై రూ.105 పెంచేశారన్నమాట. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడిపదార్థాల ధరలు పెరగడం, విద్యుత్, రవాణా చార్జీలూ భారంగా మారడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి.

 41 సిమెంట్ కంపెనీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 41 సిమెంట్ కంపెనీలున్నాయి. ఇవి 34 రకాల బ్రాండ్లతో సిమెంట్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో 20 బ్రాండ్లకు మాత్రం మార్కెట్లో కొంచెం ఎక్కువ గిరాకీ ఉంది. గతంలో రెండు రాష్ట్రాల్లోని కంపెనీలు కలిపి నెలకు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసేవి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడానికి ఉత్పత్తిని 11 లక్షల టన్నులకు తగ్గించినట్టుగా బిల్డర్లు అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా సిమెంట్ తయారీ రాష్ట్రాల్లో ధర తక్కువగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సిమెంట్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాయితీ ధరకే సిమెంట్ లభించాలని బిల్డర్లు కోరుతున్నారు.

 ఇతర రాష్ట్రాల్లో: సమైక్య రాష్ట్రంలో గతేడాది జులైలో సిమెంట్ ధర (50 కిలోలు) రకాన్ని బట్టి రూ.320 దాకా ఉంది. తర్వాతి నెలలో రూ.200-225కు పడిపోయింది. గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో బస్తా సిమెంట్ ధర రూ.360-రూ.370, కర్ణాటకలో రూ.350,  కేరళలో రూ.370, ఢిల్లీలో రూ.280-రూ.290, మహారాష్ట్రలో రూ.300, బెంగళూరులో రూ.310-320, ముంబైలో రూ.260-రూ.270 ఉంది.

 ప్రభుత్వం చేయాల్సినవివే..

1.  మూకుమ్మడిగా పెంచిన సిమెంట్ ధరలపై ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కు ఫిర్యాదు చేస్తామని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ ప్రెసిడెంట్ ఎస్ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అన్ని నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపై తీసుకొచ్చి నిర్మాణ పనులను నిలిపివేస్తాం. అయినా ధరలు తగ్గించకపోతే ఫ్లాట్ల ధరలను చ.అ.కు రూ.200 లకు పైగా పెంచుతాం. అంతిమంగా ఈ భారం సామాన్యులపైనే పడుతుంది.
2.    సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తాండూర్, ఆదిలాబాద్‌ల్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి.
3.    ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి వాహనాలకు టోల్, సర్వీస్ టాక్స్ వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి.
4.    సిమెంట్ పరిశ్రమల్లో విడుదలయ్యే ఉష్ణోగ్రతను వృథాగా వదిలేయకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఖర్చు బాగా కలిసొస్తుంది. ఉష్ణోగ్రతను సద్వినియోగం (వేస్ట్‌హీట్ రికవరీ) చేసుకునే ప్రక్రియకు పునరుత్పాదక ఇంధన హోదాను కూడా కల్పించాలి.
 5.    విద్యుత్తు ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లైయాష్, శ్లాగ్‌ను ముడిపదార్థంగా వినియోగించి సిమెంట్‌ను తయారు చేయవచ్చు. విద్యుత్ సంస్థల నుంచి సిమెంట్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్‌ను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 

మరిన్ని వార్తలు