నిజంగా విశేషమే!

28 Jun, 2014 00:27 IST|Sakshi
నిజంగా విశేషమే!

 సినిమా వేడుకలకు హీరోయిన్లు అతిథులుగా వెళ్లడం కామనే. కానీ... త్రిష, నయనతార కలిసి ఓ వేడుకకు అతిథులుగా వెళ్లడం మాత్రం నిజంగా విశేషమే. ఎందుకంటే... ఒకప్పుడు వీరిద్దరూ బద్ద శత్రువులు. ఇప్పుడేమో ప్రాణ మిత్రులు. తాము నటించిన సినిమాల వేడుకలకే వారు సరిగ్గా హాజరవ్వరు. ఆ విషయంలో త్రిష కొంచెం పర్లేదు. అగ్ర హీరోల సినిమా అంటే.. అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. కానీ నయన మాత్రం... ‘ఎవరి సినిమా అయితే ఏంటి? డోంట్‌కేర్’ అనే రకం.

తను ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ సినిమానే పట్టించుకోని విశాల హృదయం నయనది. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రానికి అతిథులుగా వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే- తన తమ్ముడు సత్యని హీరోగా పరిచయం చేస్తూ తమిళ స్టార్ హీరో ఆర్య ‘అమరకావ్యం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక త్వరలో జరగనుంది.

ఈ వేడుకకు త్రిష, నయన అతిథులుగా వస్తే... వేదిక గ్లామరస్‌గా ఉంటుందని, తన తమ్ముడికి కూడా వీరి రాక కలిసొస్తుందని ఆర్య భావించాడట. పైగా ఆర్యకు త్రిష, నయనతార మంచి ఫ్రెండ్స్. ఇంకేముంది! అడగడమే ఆలస్యం ఇద్దరూ ‘సై’ అనేశారట. తమ సినిమాల ప్రమోషన్లు పట్టించుకోరు కానీ, పరాయి సినిమాల వేడుకలకు అతిథులుగా వెళ్లడం నిజంగా విడ్డూరం అంటూ కోలీవుడ్డంతా చెవులు కొరుక్కుంటున్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా