సిమెంట్ కు సహజ వనరుల కొరత!

13 May, 2016 00:44 IST|Sakshi
సిమెంట్ కు సహజ వనరుల కొరత!

ప్రస్తుతమున్న బొగ్గు, సున్నపురాయి నిల్వలు 30 ఏళ్ల వరకే
ఆ తర్వాత పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం; ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచన
సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సిమెంట్ ఉత్పత్తికి ప్రధాన వనరులు బొగ్గు, సున్నపురాయి వంటి సహజ వనరులే. కానీ, మన దేశంలో వీటి లభ్యత రోజురోజుకూ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కూడా. ప్రస్తుతం దేశంలో ఉన్న సహజ వనరులు మరో 30 ఏళ్ల వరకు మాత్రమే ఈ పరిశ్రమకు సరిపోతాయి. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? అంటే ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదని’’ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమని చెప్పుకొచ్చారు.

అందుకే సిమెంట్ ఉత్పత్తిలో ప్రారంభ స్థాయి నుంచే ఆధునిక సాంకేతికత వినియోగించడంతో పాటూ సాధ్యమైనంత వరకూ ముడి  పదార్థాలు, వ్యర్థాల పున ర్ వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చౌక్సీ సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ‘12వ గ్రీన్ సిమెంటెక్-2016’ రెండు రోజుల సదస్సు గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శైలేంద్ర చౌక్సీ ఏమన్నారంటే..

రానున్న రోజుల్లో దేశంలో సిమెంట్ వినియోగ సగటు పెరగనుంది. స్మార్ట్ సిటీ లు, అందరికీ ఇళ్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అనేక పథకాలే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు సిమెంట్ పరిశ్రమకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికీ తీసుకెళ్లాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.

దేశంలో ఏటా 380 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి అవుతుంది. అయితే గత నాలుగే ళ్లుగా ఉత్పత్తి 2-4 శాతం తగ్గింది. గత రెండు దశాబ్ధాలుగా సిమెంట్ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 8 శాతాని కంటే తక్కువకు పడిపోయింది. దేశ ఆర్థిక సంక్షోభం, ప్రపంచ మాంద్యం, గ్రామీణ ఆర్థిక ప్రతికూలతలు ఇందుకు కారణం. కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నడూ చూడని విధంగా గతేడాది మార్చి నెలలో 11 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మొత్తం మీద 6 శాతం వృద్ధి రేటుంటుందని అంచనా వేస్తున్నాం.

సదస్సులో కేశోరాం ఇండస్ట్రీస్ (గ్రీన్‌కో ప్లాటినం), అల్ట్రాటెక్ సిమెంట్ లి. (గ్రీన్‌కో గోల్డ్)లకు గ్రీన్‌కో అవార్డులు, దాల్మియా సిమెంట్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలైస్ లి., జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ లి., అల్ట్రాటెక్ ఎక్స్‌ట్రాలైట్ ఏఏసీ బ్లాక్స్‌లకు గ్రీన్‌ప్రో అవార్డులు అందించారు. అలాగే  గ్రీన్ చాంపియన్స్ ఆఫ్ ఇండియన్ సిమెంట్ సెక్టార్, కాంపోసైట్ సిమెంట్ మార్చి 2016 పబ్లికేషన్స్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏ సెక్రటరీ జనరల్ ఎన్‌ఏ విశ్వనాథన్, గ్రీన్‌సిమెంటెక్ చైర్మన్ జీ జయరామన్, కో-చైర్మన్లు కేఎన్ రావు, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు