ఇంటి అద్దె చెల్లిస్తున్నారా?అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

20 Nov, 2023 09:34 IST|Sakshi

గతవారం స్థిరాస్తి అద్దెకిచ్చినప్పుడు ఓనర్‌గారికి ఆ ఆదాయం ఎలా లెక్కించాలి .. మినహాయింపులేమిటి? మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఈసారి మీరు అద్దె చెల్లించే వారయితే .. అంటే మీరు కిరాయిదారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన విషయాలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్‌ గురించి తెలుసుకుందాం. 

మీరు ఇచ్చే రెంటుకి అగ్రిమెంటు రాసుకోండి. దయచేసి రెంటును నగదు రూపంలో ఇవ్వకండి. చెక్కు ద్వారా, డ్రాఫ్ట్‌ ద్వారా, బదిలీ ద్వారా రెంటు ఇవ్వండి. 

కొంత నగదు, కొంత బ్యాంకు అని ఒప్పుకోకండి. రెంటు ఇవ్వగానే రసీదు పుచ్చుకోండి. కనీసం ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ ద్వారా, ఈమెయిల్‌ ద్వారానైనా తీసుకోండి. సత్సంబంధాలు కొనసాగినన్నాళ్లూ రసీదు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ జాతివైరం సహజం. ముందుగా ఆలోచించి ఒక అలవాటుగా అనుసరించండి. 

ప్రత్యేకించి నగదు పుస్తకం, లెడ్జర్‌లో పద్దులు రాయకపోయినా, ఈ వ్యవహారాలను అన్ని వివరాలతో సహా ఒక పుస్తకంలో రాయండి. 

మీరు ఉద్యోగైనా, వ్యాపారస్తులైనా, వృత్తి నిపుణులైనా ఇలా చెల్లించే అద్దెను ఖర్చుగా భావించి, మినహాయింపు పొందాలంటే కాగితాలు కావాలి. 

మీ ఓనర్‌ పాన్‌ నంబరు, బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని భద్రపర్చుకోండి. 

ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీద అద్దె వసూలయ్యే సందర్భాలూ ఉంటాయి. భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, అన్నదమ్ములు, ఇలాంటి అతి తెలివి వారుంటారు. మీకు సంబంధం లేకపోయినా, మీరు గట్టిగా అడగలేకపోయినా.. కాగితాలు, రసీదు లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

194– ఐ సెక్షన్‌ కొన్ని బాధ్యతలను అంటకట్టింది. అదే టీడీఎస్‌. 

చెల్లించే వార్షిక అద్దె రూ. 2,40,000 దాటితే ప్రతి చెల్లింపునకు టీడీఎస్‌ కట్‌ చేసి, ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో చెల్లించి ఆ మేరకు ఫారం 16 అని మీ యజమానికి 
ఇవ్వాలి. 
 
194– ఐ వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. 

మరో సెక్షన్‌ 194  ఐఆ ఉందండోయ్‌. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. 

వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, ‘ట్యాక్స్‌ ఆడిట్‌’ అవసరం లేని వారు, వర్తించనివారికి ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. 

అద్దె నెలకి రూ. 50,000 దాటిన వారికే వర్తిస్తుంది. నెలలో కొంత వ్యవధికి అయినా వర్తిస్తుంది. 

నెలకి రూ. 50,000 అంటున్నారు, సంవత్సరానికి అని అనడం లేదు.. మీరు వారం రోజులకు అద్దె ఇచ్చి రూ. 50,000 దాటి పుచ్చుకుంటే చాలు. 

ఇలా అద్దె ఇచ్చేటప్పుడు పన్ను రికవరీ చేసి మిగతా మొత్తమే ఇవ్వాలి. ట్యాక్సును సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, ఆ మేరకు టీడీఎస్‌ సర్టిఫికెట్‌ 16 ఇ ద్వారా 
ఇవ్వాలి. 

పన్ను వసూలు చేయకపోయినా, వసూలు చేసిన మొత్తం సకాలంలో చెల్లించకపోయినా, సకాలంలో టీడీఎస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోయినా .. వడ్డీ, పెనాల్టీలు భరించాలి. 

ఏతావతా.. రెంటు చెల్లించిన వారికి మాత్రమే టీడీఎస్‌ బరువు, బాధ్యతలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు