ఆర్‌బీఐకి సీఐసీ షోకాజ్‌ నోటీసు

6 Dec, 2019 02:30 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేసులో

విచారణకు హాజరు కాని ఫలితం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తనిఖీ నివేదికల వెల్లడి వివాదానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కేంద్రీయ సమాచార కమిషన్‌ (సీఐసీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు హాజరు కావాలన్న తమ ఆదేశాలను ఆర్‌బీఐ సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (సీపీఐవో) తేలిగ్గా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  వివరాల్లోకి వెడితే.. 2011 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జరిపిన తనిఖీల వివరాలు వెల్లడించాలంటూ గిరీష్‌ మిత్తల్‌ అనే వ్యక్తి ఆర్‌టీఐ కింద ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అనుకూలంగా ఆర్‌బీఐ సీపీఐవో సూచనలు జారీ చేశారు. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన వ్యాపార వివరాలు వెల్లడి కావడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీపీఐవోకి తెలిపింది. కానీ సీపీఐవో దాన్ని తోసిపుచ్చడంతో సీఐసీని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ సీఐసీ ఆదేశించినప్పటికీ.. ఆర్‌బీఐ సీపీఐవో గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు