ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల ప్యాకేజీ!

8 Aug, 2018 00:44 IST|Sakshi

ఆర్థిక శాఖతో పౌర విమానయాన శాఖ చర్చలు

ముంబై: తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పాయి.

నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు పరం చేద్దామనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదన ముందుకు రావడం గమనార్హం. భారంగా మారిన రుణాలను కొంత వరకు తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనుంది. ‘‘ఎయిర్‌ ఇండియా బ్యాలన్స్‌ షీటును మెరుగుపరచడం వల్ల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం తిరిగి ప్రయత్నించినప్పుడు అది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఎయిర్‌ ఇండియాకు పూర్వపు యూపీఏ హయాంలో 2012లో ఒకసారి బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు 2017 మార్చి నాటికి రూ.48,000 కోట్ల రుణ భారం ఉంది. గత నెలలో రూ.980 కోట్ల మేర సప్లిమెంటరీ గ్రాంట్స్‌ కింద ఎయిర్‌ ఇండియాకు ఇచ్చేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదం కోరిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు