ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు

5 Nov, 2023 05:47 IST|Sakshi

ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హెచ్చరిక

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే నవంబర్‌ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ  హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

‘నవంబర్‌ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్‌ చేశాడు. ఆ రోజున వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గుజరాత్‌లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం.

ఇజ్రాయెల్‌–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్‌ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్‌ 10న పన్నున్‌ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్‌ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న  పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది.

మరిన్ని వార్తలు