నివాసితులకు ‘రాజ్యాంగం’

4 Feb, 2017 00:40 IST|Sakshi
నివాసితులకు ‘రాజ్యాంగం’

దాన్ని పాటిస్తేనే కమ్యూనిటీలకు అందం
సాక్షి, హైదరాబాద్‌: కొన్ని అపార్ట్‌మెంట్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అవి నిత్యనూతనంగా ఉంటాయి. మరి అపార్ట్‌మెంట్‌ అందంగా కనిపించాలంటే నిర్వహణ సక్రమంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఫ్లాట్ల విలువ గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే సక్రమ నిర్వహణతోనే విలువ రెట్టింపవుతుందని సూచిస్తున్నారు.

గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించే ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం, ఒక్కో ప్రాంతం, విద్యాబుద్ధులు, వేషభాషలు, ఆలోచనా విధానం, మనస్తత్వం.. ఇలా ప్రతి అంశంలోనూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో నిర్మాణం మినీ భారతంను తలపిస్తున్న నేపథ్యంలో భవన పటిష్టత కోసం అందరూ ప్రయత్నించాలి. ఎవరికి వారే తమకెందుకులే అని భావించినా తీరిక లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినా నష్టం అందరి మీద పడుతుంది. అపార్ట్‌మెంట్‌ కళావిహీనంగా తయారవుతుంది. కాబట్టి సంఘం నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసేటప్పుడు అధిక శాతం మంది దృష్టిసారించాలి.

అతిక్రమిస్తే శిక్షార్హులే..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్నవారంతా సంఘంగా ఏర్పడాలనేది అపార్ట్‌మెంట్‌ చట్టంలోని మొదటి నిబంధన. దీన్ని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించుకోవాలి. బిల్డర్‌ ప్రతిపాదించకున్నా సభ్యులే కలసి సంఘం గా ఏర్పడి నియమ నిబంధనలు (బైలాస్‌) రూపొందించుకోవాలి. వీటిని అందరూ గౌరవించాలి. అతిక్రమించిన వారు చట్టప్రకారం శిక్షార్హులవుతారు కూడా.

బిల్డర్‌ చేసే ఆలస్యానికి విసిగిపోయి.. ఆయా అపార్ట్‌మెంట్‌లోని మిగతా పనులన్నీ బిల్డర్‌ చేత పూర్తి చేయడానికి ప్రత్యేక సంఘంగా ఏర్పడాలి. బిల్డర్‌ మీద ఒత్తిడి తెచ్చి పనుల్ని పూర్తి చేయడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మున్సిపల్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మితమైన ఒక అపార్ట్‌మెంట్‌లో రెండు సొసైటీలు ఉండకూడదు. ఒక సొసైటీని గరిష్టంగా ఆరేళ్ల దాకా కాలపరిమితిని పెట్టకోవచ్చు. ప్రతి సంఘం కూడా మినిట్స్‌ పుస్తకాన్ని నిర్వహించాలి. కొత్తగా ఎన్నికైన సంఘానికి పాత కమిటీ సభ్యులూ అకౌంట్స్‌ పుస్తకాలు, ఆస్తుల జాబితాను తప్పకుండా అందజేయాలి. లేకపోతే చట్ట ప్రకారం పాత సభ్యుల మీద చర్యలు తీసుకోవచ్చు.

నిర్వహణ రుసుము పక్కా..
నిర్వహణలో లోపం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిర్వహణ రుసుమును గడువులోగా చెల్లించాలి. కమిటీ సభ్యులు దేనికెంత ఖర్చవుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని నెలసరి నిర్వహణ రుసుమును నిర్ణయించాలి. తీవ్ర కసరత్తులు జరిపాకే ఒక నిర్ణయానికి రావాలి. నివాసితులందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి విషయాన్ని క్షుణ్ణంగా వివరించాలి. సభ్యులంతా కూర్చొని రాగద్వేషాలకు తావివ్వకుండా అపార్ట్‌మెంట్‌ పటిష్టతను దృష్టిలో పెట్టుకొని అంతిమ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకవేళ నిర్వహణ రుసుమును పెంచాల్సి వస్తే నివాసితులు తొందరపడకుండా కమిటీ సభ్యులు చెప్పే కారణాలను విశ్లేషించాలి. అవసరమైతే ప్రత్యామ్నాయాలను సూచించాలి. అంతేతప్ప కమిటీ సమావేశంలో వితండవాదం చేస్తే నష్టపోయేది అపార్ట్‌మెంట్‌లో నివసించే గృహ యజమానులే.

నెలసరి నిర్వహణ రుసుమును చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలో సంఘం నిబంధనల్లో రాసుకోవాలి. నిర్వహణ రుసుము కట్టనివారి మౌలిక సదుపాయాలు రద్దు చేసే అధికారం సంఘానికి ఉంటుందని అందరూ గుర్తుంచుకోవాలి.


నిర్వహణ సూత్రాలివే..
ఫ్లాట్ల సంఖ్యను బట్టి సంఘంలో ఎంతమంది సభ్యులుండాలనే విషయంలో ముందు స్పష్టత రావాలి. 50 కంటే తక్కువ ఫ్లాట్లుంటే అది కూడా ఒకే బ్లాక్‌ మాదిరిగా ఉంటే సంఘంలో ఐదారుగురు కీలక సభ్యులుండొచ్చు. కాకపోతే బిల్డర్లు, పలు నిర్మాణాల్ని టవర్లు లేదా బ్లాకుల మాదిరిగా నిర్మిస్తుంటారు. ఒక్కో బ్లాకు నుంచి సంఘంలో ప్రాతిని«థ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొనుగోలుదారుల నుంచి బిల్డర్‌ ముందే కార్పస్‌ ఫండ్‌ వసూలు చేస్తాడు. ఏ సంఘమైనా నిర్వహణలో ఇబ్బందులు ఎదురుకావొద్దంటే కార్పస్‌ ఫండ్‌ను దేనికోసం వినియోగించాలి? ఏయే అవసరాలకు వాడకూడదనే అంశంలో స్పష్టంగా రాతకోతలుండాలి. బిల్డర్‌ అందజేసే కార్పస్‌ ఫండ్‌ను బ్యాంక్‌లో జమ చేసే ముందు ఏయే బ్యాంక్‌ అధిక వడ్డీనిస్తుంది? అత్యవసరాల్లో మెరుగైన సేవలను అందిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించాలి. నాలుగైదు బ్యాంకులను కలసి వివరాలను సేకరించి అంతిమ నిర్ణయం తీసుకోవాలి. సొమ్మును ఎన్నేళ్ల పాటు బ్యాంకుల్లో కదలకుండా ఉంచాలి? ఒకవేళ తీయాల్సి వస్తే ఏయే సందర్భాల్లో ఆయా సొమ్మును వినియోగించకూడదు? వంటి విషయాలకు సంబంధించి నియమ నిబంధనల్లో స్పష్టంగా రాసుకోవాలి. లేకపోతే నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా కష్టమే.

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలుమాకు రాయండి. realty@sakshi.com

మరిన్ని వార్తలు