క్రీమ్‌లైన్‌ డెయిరీ విస్తరణ..

17 May, 2018 00:54 IST|Sakshi

కొత్తగా మరో మూడు ప్లాంట్లు 

రూ.400 కోట్ల పెట్టుబడి 

సంస్థ ఎండీ భాస్కర్‌ రెడ్డి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జెర్సీ బ్రాండ్‌ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రోడక్ట్స్‌ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్‌ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ప్రస్తుత ప్రాసెసింగ్‌ సామర్థ్యం రోజుకు 12 లక్షలు. విస్తరణతో 15 లక్షల లీటర్లకు చేరుతుందని చెప్పారు. రూ.35 కోట్లతో వైజాగ్‌ వద్ద నిర్మిస్తున్న రోజుకు లక్ష లీటర్ల కెపాసిటీగల ప్లాంటు ఈ ఏడాది చివరికి
కార్యరూపంలోకి వస్తుందన్నారు.  

మూడు వేరియంట్లలో..: గోద్రెజ్‌ అగ్రోవెట్‌ అనుబంధ కంపెనీ అయిన క్రీమ్‌లైన్‌ డెయిరీ జెర్సీ థిక్‌షేక్స్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. 180 మిల్లీలీటర్ల ఈ ఫ్లేవర్డ్‌ మిల్క్‌ ప్యాక్‌ ధర రూ.25 ఉంది. రూ.22,000 కోట్ల శీతల పానీయాల మార్కెట్లో పాలతో తయారైన ఉత్పత్తుల వాటా 4 శాతం. అయితే వృద్ధి పరంగా చూస్తే అత్యధికంగా 15 శాతం నమోదు చేస్తోందని క్రీమ్‌లైన్‌ డెయిరీ సీఈవో రాజ్‌ కన్వర్‌ తెలిపారు. దేశంలో డెయిరీ ఇండస్ట్రీ 5–6 శాతం వార్షిక వృద్ధితో రూ.6 లక్షల కోట్లుంది. 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని గోద్రెజ్‌ అగ్రోవెట్‌ ఎండీ బలరామ్‌ సింగ్‌ యాదవ్‌ వెల్లడించారు. రుచి సోయా ఆయిల్‌పామ్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను దాఖలు చేశామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు