మన డేటా మన దగ్గరే ఉండాలి..

18 Jun, 2019 08:54 IST|Sakshi

దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలి

విదేశాల్లో భద్రపర్చడం శ్రేయస్కరం కాదు

కేంద్ర మంత్రితో భేటీలో ఈ కామర్స్‌ వర్గాలు  

న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ–కామర్స్‌ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ–కామర్స్‌లో విదేశీ పత్య్రక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌తో సోమవారం సమావేశమైన వివిధ డిజిటల్‌ కామర్స్‌ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు.

ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ దేశీ వినియోగదారుల డేటాను దేశ ప్రయోజనాలకు తోడ్పడేలా ఉపయోగించాలని తెలిపారు. మరోవైపు, దేశీ ఈకామర్స్‌ కంపెనీలకు, విదేశీ ఈ కామర్స్‌ సంస్థలకు నిబంధనలు వేర్వేరుగా ఉండటం వల్ల కంపెనీలు సమాన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయని మరో డిజిటల్‌ కామర్స్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు. విదేశీ సంస్థల నుంచి దేశీ కంపెనీలకు పొంచి ఉన్న ముప్పు, అందరికీ సమాన అవకాశాల కల్పన, వివక్షపూరిత విధానాలు మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. తదుపరి మరింత వివరాలేమైనా ఇవ్వదల్చుకుంటే వచ్చే వారం తెలియజేయాలంటూ మంత్రి ఈ–కామర్స్‌ సంస్థల వర్గాలకు సూచించారు. జాతీయ ఈ–కామర్స్‌ విధానాన్ని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో మంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు