విద్యా రుణానికి మెరుగైన మార్గం

22 Jul, 2019 12:11 IST|Sakshi

సులభంగానే రుణ సదుపాయం

తక్కువ వడ్డీ రేటుకూ ఆఫర్‌

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్‌ ద్వారా కేంద్రం సాయం

ఈ పోర్టల్‌లో సమగ్ర వివరాలు

ఇక్కడి నుంచే దరఖాస్తుకు అవకాశం

పేరున్న విద్యా సంస్థల్లో చదవడం ద్వారా తమ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ, అందరికీ తగినంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. పైగా విద్యా వ్యయాలు ఏటేటా భారీగానే పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే అభిలాష కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. అయితే, ఇందుకోసం అయ్యేంత ఖర్చు సొంతంగా భరించే సామర్థ్యం లేదని వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ఓ మంచి మార్గం. 2015లో సగటు విద్యా రుణం సైజు రూ.5.73 లక్షలుగా ఉంటే, 2018లో రూ.8.5 లక్షలకు పెరిగినట్టు ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ డేటా తెలియజేస్తోంది. మూడేళ్లలోనే 45 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కనుక భారీ వ్యయాల కోసం రుణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది. 

విద్యా రుణం తీసుకోవడానికి ముందు ప్రతీ ఒక్కరూ ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంది, చెల్లింపుల సౌలభ్యాన్ని విచారించుకోవడం ఎంతైనా అవసరం. రుణాలపై వడ్డీ రేట్ల వివరాలను ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వెబ్‌సైట్ల సాయంతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పోర్టల్‌ ద్వారా ఈ విషయంలో పూర్తి సహకారం కూడా అందిస్తోంది. విద్యా రుణం గురించి వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు తీరు తెన్నులను ట్రాక్‌ చేసుకునేందుకు ఈ పోర్టల్‌ సాయపడుతుంది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో, చెల్లింపుల పరంగా సౌకర్యంగా ఉన్న బ్యాంకు నుంచి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్జిన్‌ మనీ
కోర్సు ఫీజుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు నూరు శాతం వరకు రుణాన్ని సర్దుబాటు చేస్తాయి. అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రూ.4 లక్షల వరకు రుణానికి మార్జిన్‌ మనీ (సొంతంగా సమకూర్చుకోవాల్సిన మొత్తం) అవసరం. దేశీయంగానే ఉన్నత విద్య చదవాలనుకుంటే అందుకు అయ్యే వ్యయంలో 5 శాతాన్ని మార్జిన్‌ మనీగా సమకూర్చుకోవాలి. అదే విదేశాల్లో విద్య కోసం రుణం తీసుకునేవారు 15% మార్జిన్‌ మనీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా రుణం మొత్తం రూ.4లక్షల కు మించకపోతే బ్యాంకులు హామీ కోరవు. రూ.4లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఉంటే హామీదారును అడుగుతాయి. రూ.7.5 లక్షలకు మించి రుణం తీసుకోదలిస్తే ఆస్తులను తనఖాగా ఉంచాలని కోరతాయి. రుణాల చెల్లింపుల్లో వైఫల్యం చోటు చేసుకుంటే వసూలు కోసం వీటిని కోరడం జరుగుతుంది. 

క్రెడిట్‌ స్కోర్‌
సాధారణంగా విద్యారుణం తీసుకునే వారికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గ్యారంటార్‌గా ఉంటారు. విద్యార్థికి క్రెడిట్‌ స్కోరు ఉండదు కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరు గ్యారంటార్‌గా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో హామీదారుగా ఉండేందుకు ముందుకు వచ్చే వారికి క్రెడిట్‌ స్కోరు తగినంత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా చూసుకోవచ్చు. 750పైన క్రెడిట్‌ స్కోరు ఉంటే రుణం సులభంగా రావడంతోపాటు, వడ్డీ రేటు తక్కువకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. లేదంటే పిల్లల విద్యావకాశాలపై ప్రతికూలత ఏర్పడుతుంది.

దరఖాస్తుదారు విద్యాలక్ష్మి పోర్టల్‌లో తప్పకుండా నమోదు చేసుకోవాలి. కామన్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన వివరాలన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం దరఖాస్తుదారుడు విద్యా రుణం కోసం పోర్టల్‌లో సెర్చ్‌ చేసి, తన అవసరాలు, సౌలభ్యాలకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి చేసే దరఖాస్తు పత్రాన్ని అన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే దీన్ని ఉమ్మడి దరఖాస్తు పత్రంగా పేర్కొన్నారు.

సక్రమంగా చెల్లింపులు
మొదటి నెల నుంచే తీసుకున్న రుణంపై వడ్డీ జమ అవడం మొదలవుతుంది. కాకపోతే రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐల చెల్లింపులు మొదలు కావడానికి మధ్యలో గ్రేడ్‌ పీరియడ్‌ ఉంటుంది. విద్యార్థి కోర్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత సాధారణంగా ఒక ఏడాది పాటు ఇది ఉంటుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ భారం పెరిగిపోకుండా, వేగంగా రుణ చెల్లింపులు పూర్తయ్యేందుకు గాను తల్లిదండ్రులు ప్రతీ నెలా కొంత మేర చెల్లించడం మంచి ప్రణాళిక అవుతుంది. 

అదనపు ప్రయోజనాలు
విద్యా రుణం తీసుకోవడం వల్ల పన్ను ఆదా వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్‌ 80ఈ కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు పొందొచ్చు. విద్యా రుణం తీసుకుని, సక్రమ చెల్లింపులు చేయడం వల్ల మంచి క్రెడిట్‌ స్కోరు కూడా నమోదవుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల విద్యా రుణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. 

మరిన్ని వార్తలు