చందా కొచర్‌ రూ.350 కోట్లు చెల్లించాల్సిందేనా?

31 Jan, 2019 19:28 IST|Sakshi

సాక్షి, ముంబై : రూ.3500 కోట్ల ఐసీఐసీఐ-వీడియోకాన్‌  కుంభకోణంలో మాజీ సీఎండీ చందాకొచర్‌కు సంబంధించి మరో షాకింగ్‌ న్యూస్‌ మార్కెట్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ కుంభకోణంపై ప్రధాన నిందితురాలు చందా కొచర్‌పై ఆరోపణల  తీవ్రంగా ఖండించడంతోపాటు, ఆమె పూర్తి మద్దతుగా నిలిచిన ఐసీఐసీఐ  బ్యాంకు  బోర్డును ఆమెను దోషిగా బహిరంగా ప్రకటించింది. అంతేకాదు.. ఆమెను  పలు చెల్లింపులను వసూలు  చేస్తామని కూడా స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో  చందా కొచర్‌ బ్యాంకుకు భారీ మొత్తమే చెల్లించాల్సి ఉందని ఎకనామిక్స్‌  టైమ్స్‌ వెల్లడించింది. ఆమెకు కేటాయించిన షేర్లు, ఇతర చెల్లింపులతో కలిపి మొత్తం రూ.350 కోట్లను చెల్లించాలని లెక్కలు తేల్చింది. ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్  కింద ఆమెకు దాదాపు రూ. 343 కోట్ల విలువైన షేర్లు , బోనస్‌లు ముట్టాయని సమాచారం. 

2008-09, 2017-18 బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం చందా కొచర్‌కు నగదు రూపంలో బోనస్‌లు రూ. 10.12 కోట్లు చెల్లించారు.  అలాగే  2009 -18 మధ్య 94 లక్షల ఐసీఐసీఐ  బ్యాంకు షేర్లు చందా కొచర్‌కు కేటాయించారు. బుధవారం మార్కెట్‌ ముగిసేనాటికి  షేర్‌ విలువ రూ. 365  చొప్పున వీటి విలువ సుమారు రూ.343కోట్లు. ఇలా మొత్తం 350 కోట్ల రూపాయలకు పైనే చందా కొచర్‌ చెల్లించాల్సి ఉంది.  అయితే 350 కోట్ల రూపాయల  చెల్లింపు విషయంపై  చందా కొచర్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. 

మరోవైపు ఈ బ్యాంకు ప్రకటనపై చందా కొచర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రిపోర్టు కాపీ తనకు ఇంకా అందలేదనీ, అయితే బ్యాంకు నిర్ణయం తనను బాధించిందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు.  34 సంవత్సరాలు అంకిత భావంతో సంస్థకు సేవలందించాను. సంస్థ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి చేశాను, కానీ సంస్థ ప్రయోజనాలకు భిన్నంగా ఎన్నడూ వ్యవహరించలేదని  వివరించారు.

కాగా 2009 నుండి 2018 వరకూ చందా కొచర్‌ ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీగా కొనసాగారు. వీడియో కాన్ కంపెనీకి రూ. 3500 కోట్లకు పైగా ఇచ్చిన రుణాల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందని వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై  ఆధారంగా చందా కొచర్‌ బ్యాంకు ప్రవర్తనానియమావళికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఐసీఐసీ బ్యాంకు  ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆమెను తొలగించడమే కాదు,  ఆమె రాజీనామాను తొలగింపుగా  పరిగణిస్తున్నామనీ, అలాగే చందా కొచర్‌కు చెల్లించిన ఇంక్రిమెంట్లు,  బోనస్‌, తదితరాలు వెనక్కి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు