గ్లోబస్‌ స్పిరిట్స్‌ అప్‌- ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ డౌన్‌

17 Jun, 2020 12:23 IST|Sakshi

క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

గ్లోబస్‌ 10 శాతం హైజంప్‌

ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ 7.5% పతనం

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఆల్కహాల్‌ బెవరేజెస్‌ కంపెనీ గ్లోబస్‌ స్పిరిట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో విద్యుత్‌ రంగ ఆధునిక ప్రొడక్టుల కంపెనీ ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గ్లోబస్‌ స్పిరిట్స్‌ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. ష్నీడర్‌ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

గ్లోబస్‌ స్పిరిట్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గ్లోబస్‌ స్పిరిట్స్‌ నికర లాభం 285 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లను అధిగమించింది. పన్నుకు ముందు లాభం సైతం 326 శాతం ఎగసి రూ. 22 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం యథాతథంగా రూ. 272 కోట్లుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్లోబస్‌ స్పిరిట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 11 లాభపడి రూ. 119 వద్ద ఫ్రీజయ్యింది.

ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రా రూ. 27 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్నుకు ముందు నష్టం రూ. 26 కోట్లుగా నమోదైంది. నికర అమ్మకాలు సైతం 20 శాతం నీరసించి రూ. 230 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం పతనమైంది. రూ. 83 దిగువన కదులుతోంది. తొలుత రూ. 80.5 వరకూ క్షీణించింది.

మరిన్ని వార్తలు