OpenAI: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్

18 Nov, 2023 13:44 IST|Sakshi

చాట్‌జీపీటీ సృష్టి కర్త, ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్‌ ఆల్ట్‌మన్‌'ను సంస్థ సీఈఓగా తొలగించిన తరువాత.. కంపెనీ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్‌మన్' కంపెనీకి రాజీనామా చేసాడు. ఓపెన్ఏఐలో జరిగిన ఈ పరిణామాలు టెక్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆల్ట్‌మన్‌ బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం లేకపోవడంతోనే తొలగించినట్లు వెల్లడించింది.

టెక్ పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను కంపెనీ తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్రాక్‌మాన్ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటిస్తూ.. ఎనిమిది సంవత్సరాల క్రితం నా అపార్ట్‌మెంట్‌లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి అందరూ కలిసి ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించుకున్నాము. ఇది గర్వించదగ్గ విషయం అంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?

ఈ రోజు వచ్చిన వార్తలు నన్ను ఎంతగానో కలచి వేశాయని, ఈ కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేస్తూ.. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సురక్షితమైన AGIని సృష్టించే లక్ష్యాన్ని నేను విశ్వసిస్తూనే ఉన్నాను అంటూ వెల్లడించాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వార్తలు