రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం!

20 Apr, 2019 05:21 IST|Sakshi

శతృ ఆస్తుల విక్రయానికి కూడా  కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల విక్రయానికి రీట్స్‌ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృ ఆస్తుల విక్రయానికి కూడా రీట్స్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది.  

రీట్స్‌ విధానంపై ఆర్థిక శాఖ చూపు....
వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్‌ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి  రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్‌ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది.  

2014లోనే రీట్స్‌ నిబంధనలు...
రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే  ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సంస్థకు చెందిన రీట్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్‌ రీట్‌ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా రీట్స్‌ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్‌ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

మరిన్ని వార్తలు