Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పెట్టండి

Published Mon, Sep 11 2023 4:24 AM

Put banks in rural areas - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకు బ్రాంచీలు ఏర్పాటు చేయాలంటూ పెద్దఎత్తున వినతులు వస్తున్న దృష్ట్యా అవసరమైన గ్రామాల్లో మరిన్ని బ్యాంకు బ్రాంచీలు నెలకొల్పాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి సూచించారు. విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగ్గా.. సమావేశ అంశాలను బ్యాంకర్ల కమిటీ ఆదివారం విడుదల చేసింది.   

కేంద్ర మంత్రి సూచనలివీ 
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ ఏ సూచనలు చేశారంటే.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకు బ్రాంచిల ఏర్పాటుకు జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్లతో సర్వే జరిపించాలి. 
   మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులను నిబంధనల మేరకు అనుమతించాలి. 
    గిరిజన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో నీతి ఆయోగ్‌ ప్రకటించిన ఆకాంక్ష జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, వైఎస్సార్‌ జిల్లాల్లో కనెక్టివిటీ సమస్యలుంటే టెలీ కమ్యూనికేషన్‌ శాఖ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం ద్వారా అవసరమైన ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి. 
    రాష్ట్రంలో 186 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేవు. ఆయా గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ గ్రామాల్లో సర్వే నిర్వహించడంతో పాటు బ్రిక్‌ అండ్‌ మోటార్‌ బ్రాంచిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.  
   అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల 109 గ్రామాల్లో చాలా గ్రామాలు వెయ్యి కంటే తక్కువ జనాభాతో రహదారి, నెట్‌ వర్క్‌ కనెక్టివిటీ లేకుండా మండల ప్రధాన కార్యాలయాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి మేజర్‌ పంచాయతీల్లోని 11 ప్రాంతాల్లో కొత్తగా బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి.

బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్యాంకులు 
కేంద్ర మంత్రి సూచనల మేరకు రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి లేదా రాజవొమ్మంగిలో ఏపీ జీవీబి బ్రాంచి ఏర్పాటు చేయనుంది. మారేడుమిల్లిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎటపాకలో ఎస్‌బీఐ, కొయ్యూరులో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచీల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జనాభా ఆధారంగా ఆరు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేశారు.

బొమ్మికలో స్టేట్‌ ఎస్‌బీఐ, గంగరేగువలసలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, మొండెంఖల్లులో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మత్తుమూరులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పి.కోనవలసలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గురండిలో ఎస్‌బీఐ బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 3 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 21 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ శాఖలు లేవని జిల్లాల లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లు గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సెంటర్‌ కూడా లేదని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement