3 బీమా సంస్థల విలీన ప్రక్రియ షురూ..

25 Apr, 2018 00:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన మూడు జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనిపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని, అయితే ఇవింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విలీనానికి సంబంధించి పూర్తి మార్గదర్శక ప్రణాళిక ఇంకా రూపొందించాల్సి ఉందని వివరించాయి.

2018–19 బడ్జెట్‌లో ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థల విలీన ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు బీమా సంస్థలు కలిసి 2016–17లో మొత్తం రూ. 44,000 కోట్ల ప్రీమియం వసూళ్లు సాధించాయి. సాధారణ బీమా రంగంలో ఈ మూడింటి వాటా 35 శాతం దాకా ఉంటుంది.

వీటిని విలీనం చేసిన పక్షంలో భారీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ దిగ్గజ సంస్థ ఏర్పాటు అవుతుంది. 2018–19లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 80,000 కోట్ల నిధుల సమీకరణలో ఈ విలీనం కీలక పాత్ర పోషించనుంది. గతేడాదే ప్రభుత్వ రంగానికి చెందిన న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ సంస్థలు లిస్టయ్యాయి.

>
మరిన్ని వార్తలు