గుడ్‌న్యూస్‌ : జీఎస్‌టీ రేటు తగ్గింపు

22 Dec, 2018 16:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్‌టీ కౌన్సిల్‌  తాజా సమావేశంలో పన్ను రేటు  తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.  జీఎస్‌టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది.  33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేటులను తగ్గించింది. 28శాతం  జీఎస్‌టీ ఉన్న సుమారు ఏడింటిని 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్‌టీ వసూలు యథాతథంగా ఉంటుంది. అయితే సిమెంట్‌పై జీఎస్‌టీ 18 శాతానికి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది.

33 వస్తువులపై జీఎస్‌టీ తగ్గించేందుకు కౌన్సిల్‌ నిర్ణయించిందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి  నారాయణ స్వామి వివరించారు.  ముఖ్యంగా టీవీలు కంప్యూటర్లు, ఆటో  పార్ట్స్‌ తదితరాల ధరలు  దిగి రానున్నాయని ఉత్తరాఖండ్‌ ఆర్తికమంత్రి ప్రకాశ్‌ పంత్‌ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్ 31వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అనంతరం జైట్లీ సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వివరాలను  ప్రకటించారు. 

వందలాది వస్తువులపై జీఎస్‌టీ కోత -జైట్లీ
వందలకొద్దీ వస్తువులపై జీఎస్‌టీ రేట్లు తగ్గించామని అని అరుణ్ జైట్లీ చెప్పారు 28శాతం జీఎస్‌టీ వసూలు చేసే 34 స్తువుల నుంచి ఆరు అంశాలను  తొలగించినట్టు చెప్పారు. మూడు వస్తువులపై జీఎస్‌టీని 18శాతంనుంచి 12శాతానికి తగ్గించినట్టు చెప్పారు.  ఈ నిర్ణయంతో దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని,  తగ్గించిన జీఎస్‌టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని  జైట్లీ వెల్లడించారు. 

అలాగే సాధారణ పొదుపు ఖాతాలు, జనధన్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఖాతాలపై బ్యాంకింగ్‌  సేవలపై ఎలాంటి జీఎస్‌టీ  వుండదని పేర్కొన్నారు.  దీంతోపాటు కేంద్రీకృత అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏర్పాటునకు  కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అరుణ్ జైట్లీ  ప్రకటించారు.ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఆర్థికమంత్రి తెలిపారు.

ఎయిర్ కండిషనర్లు,  32 అంగుళాల టీవీలు,  టైర్లు, లిథియం బ్యాటరీల పవర్‌ బ్యాంక్స్‌ 18శ్లాబులోకి
దివ్యాంగులకు సంబంధించిన పలు ఉత్పత్తులపై 18నుంచి అతితక్కువగా 5శాతానికి తగ్గింపు
వంద రూపాయిలలోపు వున్న సినిమా  టికెట్లపై 18 శాతంనుంచి  12శాతానికి
రూ.100 పైన  ఉన్న టికెట్లపై 28  శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
థర్డ్‌ పార్ట్‌ ఇన్సూరెన్స్‌పై వసూలు చేసే  జీఎస్‌టీ18 -12 శాతానికి తగ్గింపు
తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు సంబంధించిన ప్రత్యేక విమానాలపై ప్రీమియం పన్ను వసూలు ఉండదు. ఎకానమీ 5, బిజినెస్‌ 12శాతం వుంటుంది.

జనవరిలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశంలో రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు.

మరిన్ని వార్తలు