-

GST: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?

22 Aug, 2023 17:29 IST|Sakshi

జీఎస్టీతో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయాయని ఓవైపు దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరోవైపు ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మాత్రం జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఒకే రేటుతో ఆదాయం తటస్థంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

తాజాగా కలకత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీలో చాలా సరళీకరణ జరిగిందన్నారు. "ఆదర్శ జీఎస్టీ అనేది ఒకే రేటును కలిగి ఉండాలి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడకూడదు. జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, సగటు పన్ను రేటు కనీసం 17 శాతం ఉండాలి. కానీ, ప్రస్తుత జీఎస్టీ 11.4 శాతం. జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది’’ అని బిబేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు.

అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ రేటు తగ్గాలని ప్రజలతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారని, అయితే అత్యల్పంగా ఉన్న సున్నా, 3 శాతం జీఎస్టీ రేట్లు పెరగాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని బిబేక్‌ అన్నారు. అందుకే మనకు సరళీకృత జీఎస్టీ అసాధ్యమని చెప్పారు. అలాగే జీఎస్టీ నిబంధనల్లోనూ చాలా దుర్వినియోగం జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి: Renters Insurance: ఇల్లు లేకపోయినా హోమ్‌ ఇన్సూరెన్స్‌! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?

మరిన్ని వార్తలు