హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం జూమ్‌

12 May, 2017 07:40 IST|Sakshi
హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం జూమ్‌

క్యూ4లో 27 శాతం వృద్ధి; రూ.2,475 కోట్లు
► ఒక్కో షేర్‌ కు రూ.6 డివిడెండ్‌
► ఆశావహంగా రెవెన్యూ గైడెన్స్‌


న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2016–17, క్యూ4)లో  27 శాతం పెరిగింది.  2015–16 క్యూ4లో రూ.1,939 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,475 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా చూస్తే నికర లాభం 12 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ చెప్పారు.

మొత్తం ఆదాయం రూ.10,925 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,183 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం–రూపాయల్లో 13 శాతం,  డాలర్లలో 15 శాతం చొప్పున వృద్ధి చెందిందని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ డివిడెండ్‌కు ఈ నెల 25 రికార్డ్‌ డేట్‌అని, వచ్చే నెల 2న చెల్లింపులు జరుపుతామని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 53 శాతం వృద్ధితో రూ.8,606 కోట్లకు, మొత్తం ఆదాయం 52 శాతం వృద్ధితో రూ.48,641 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

ఆశావహ అంచనాలు
మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని విజయ్‌కుమార్‌  సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక వృద్ధి అవకాశాలున్న విభాగాలపై పెట్టుబడుల జోరు పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నామన్నారు. నిర్వహణ లాభం 19.5–20.5 శాతం రేంజ్‌లో ఉండగలదని పేర్కొన్నారు.

అంచనాలను మించి...
కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని నిపుణులంటున్నారు.  టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పోల్చితే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మంచి వృద్ధి సాధించిందని తెలిపారు. నికర లాభంలో  టీసీఎస్‌ 4.2 శాతం, ఇన్ఫోసిస్‌ 3.4 శాతం చొప్పున వృద్ధి సాధించగా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 27 శాతం వృద్ధి సాధించడం విశేషం.

పన్ను రివర్సల్‌ కారణంగా నికర లాభం పెరిగిందని. ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ అని షేర్‌ఖాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ వ్యాఖ్యానించింది. ఐటీ రంగంలో కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చింది. ఐటీ కంపెనీలకు ఆటోమేషన్, డిజిటలైజేషన్‌ వంటి కొత్త అవకాశాలు లభిస్తుండగా, వీసా నిబంధనలు కఠినతరం కావడం వంటి సమస్యలు తప్పట్లేదు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 0.4 శాతం నష్టపోయి రూ.839 వద్ద ముగిసింది.

వీసా సమస్యల్లేవ్‌
వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం తమపై పెద్దగా ప్రభావం చూపబోదని విజయకుమార్‌ వివరించారు. తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది స్థానికులే ఉంటారని పేర్కొన్నారు. అమెరికాలో తమకు 12 సెంటర్లున్నాయని, వీటిల్లో 12,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో సగానికి పైగా అమెరికన్‌లేనని తెలిపారు.

తమ కంపెనీ మొత్తం ఆదాయంలో 63 శాతం వరకూ అమెరికా మార్కెట్‌ నుంచే వస్తోందని విజయ్‌కుమార్‌ వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,15,973గా ఉందని, సమీక్షా క్వార్టర్‌లో కొత్తగా 10,605 మందికి ఉద్యోగాలిచ్చామని వివరించారు. కాగా రూ.3,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ మరో రెండు నెలల్లో ముగియగలదని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఎఫ్‌ఓ అనిల్‌ చనానా పేర్కొన్నారు. ఈ ఏడాది రిటర్న్స్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌ఓఈ) 27 శాతంగా ఉండగలదని తెలిపారు.

మరిన్ని వార్తలు