వాయిదాల్లో ఆరోగ్య బీమా!

23 May, 2016 02:23 IST|Sakshi
వాయిదాల్లో ఆరోగ్య బీమా!

ఇల్లు... కారు... మొబైల్... ఇవన్నీ ఎలాగైతే వాయిదాల్లో కొంటున్నామో అలాగే ఇకపై ఆరోగ్య బీమా పాలసీని కూడా ఎంచక్కా వాయిదాల్లో తీసేసుకోవచ్చు!! అంటే ఏడాదికోసారి చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఇక నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించొచ్చు. నిజం!! సాధారణ బీమా కంపెనీలైన ఫ్యూచర్ జెనరాలీ ఇండియా, రిలయన్స్ ఇన్సూరెన్స్‌లు ఇలాంటి పాలసీల్నిపుడు మార్కెట్లోకి తెచ్చాయి. అంటే కాస్తంత ఎక్కువ మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలని భావించి... అంత ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించలేని వారికిది బాగా పనికొస్తుందన్న మాట. అదీ కథ.
 
* కవరేజీ మొత్తం రూ.3 లక్షలు దాటితే సౌలభ్యం
* ఫ్యూచర్ జెనరాలీ, రిలయన్స్ పాలసీలు మార్కెట్లోకి
* ఆరునెలలు, 4నెలలు, నెలవారీ చెల్లించే అవకాశం
* కొనుగోలు శక్తిని పెంచటానికేనంటున్న కంపెనీలు


ఇక్కడ పాలసీదారులు గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. ఒకేసారి  చెల్లించే ప్రీమియం కన్నా ఇలా నెలవారీ చెల్లించే ప్రీమియం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే ప్రీమియం మొత్తం నిర్దిష్ట పరిమితిని దాటితేనే ఈ అవకాశముంటుంది. చిన్నాచితకా మొత్తాల్ని కూడా ఈఎంఐలలో చెల్లిస్తామంటే కుదరదు. పెపైచ్చు దీర్ఘకాల పాలసీలకే ఈ అవకాశాన్నిస్తున్నాయి. అయితే దీర్ఘకాల పాలసీలకు ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే వచ్చే డిస్కవుంట్ మాత్రం ఈఎంఐను ఎంచుకుంటే రాదని కూడా గుర్తుంచుకోవాలి.
 
ఫ్యూచర్ జెనరాలీ: రూ.3 లక్షలు, అంతకన్నా ఎక్కువ సమ్ అష్యూర్డ్ ఉన్న హెల్త్ పాలసీలకే ఈ కంపెనీ ఈఎంఐ అవకాశాన్నిస్తోంది. దీనికి ప్రీమియం ఆరునెలలకోసారి చెల్లించేట్లయితే సమ్ అష్యూర్డ్‌లో 3 శాతం, క్వార్టర్లీ అయితే 4 శాతం, నెలవారీ అయితే 5 శాతంగా ఉంటుంది. అయితే మూడేళ్ల ఈ పాలసీ కోసం ప్రీమియం గనక ఏకకాలంలో చెల్లిస్తే 10 శాతం, రెండేళ్ల పాలసీకైతే 7.5 శాతం డిస్కవుంట్ లభిస్తోంది. అంటే మూడేళ్ల పాలసీకి గనక మీరు నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటే... ఏకకాలంలో చెల్లించే మొత్తంకన్నా 15 శాతం అధికంగా చెల్లిస్తారని గుర్తుంచుకోవాలి. ’’అధిక బీమా కవరేజీ కావాలనుకున్నవారికి ఈఎంఐ బాగుంటుంది.

ఉదాహరణకు రూ.5 లక్షల పాలసీని మాత్రమే కొనుగోలు చేసే శక్తి ఉన్నవారు ఈఎంఐ ద్వారా 10 లక్షల పాలసీని కూడా తీసుకోగలుగుతారు. లేకపోతే వ్యక్తిగత పాలసీ తీసుకోవాలని భావించేవారు ఈఎంఐ వల్ల ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకునే వీలుంటుంది. ఎందుకంటే చెల్లింపు ఒకేసారి చేయాల్సిన అవసరం ఉండదు కనక’’ అని ఫ్యూచర్ జెనరాలీ హెల్త్ బీమా హెడ్ శ్రీరాజ్ దేశ్‌పాండే చెప్పారు.
 
రిలయన్స్ ఇన్సూరెన్స్: ఈ కంపెనీ ఈఎంఐ ఆప్షన్‌ను ఏడాది, రెండేళ్ల పాలసీలు అన్నిటికీ వర్తింపజేసింది. సమ్ అష్యూర్డ్ మాత్రం రూ.3 లక్షలకన్నా అధికంగా ఉండాలి. ‘‘కస్టమర్ల కొనుగోలు శక్తిని పెంచాలన్నదే మా ఉద్దేశం. రూ.10వేలు దాటిన ప్రీమియంను ఈఎంఐలలో చెల్లించే అవకాశం ఉంటుంది’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ జైన్ చెప్పారు. ఆరునెలలు, క్వార్టర్లీ పద్ధతిలో వాయిదాలు చెల్లించే అవకాశం ఉంది.
 
ఈఎంఐకి ముందే క్లెయిమ్ చేస్తే...!
ఏడాది మొత్తానికి వాయిదాలు చెల్లించాల్సిందే. అయితే చెల్లించకముందే క్లెయిమ్ చేసినట్లయితే... ఆ మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ మొత్తం నుంచి మినహాయించుకుంటారు. ఉదాహరణకు నెలకు రూ.2000 ఈఎంఐ కడుతున్న పాలసీదారు... 8 నెలలు చెల్లించాక ఆసుపత్రి పాలై రూ.2 లక్షలకు క్లెయిమ్ చేశారనుకుందాం. ఇంకా నాలుగు నెలల పాటు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంది కనక... క్లెయిమ్ మొత్తమైన రూ.2 లక్షల్లోంచి దాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే మంజూరు చేస్తారు. ఆ మొత్తాన్ని పాలసీదారు భరించాల్సిందే. ‘‘సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పొందాలంటే వార్షిక మొత్తాన్ని పూర్తిగా చెల్లించి ఉండాలి’’ అని దేశ్‌పాండే తెలియజేశారు.

మరిన్ని వార్తలు