మనోళ్ల ‘హెల్త్‌ కవర్‌’ అంతంతే..!

10 Sep, 2023 06:45 IST|Sakshi

అన్‌లిమిటెడ్‌ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్‌ క్యాపింగ్‌పై అంతగా అవగాహన లేని పాలసీ హోల్డర్లు

కోవిడ్‌ సమయంలో జీవిత బీమా లేనివారు రూ.20 వేల కోట్లకు పైగానే ఖర్చు చేశారని అంచనా

68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ

కరోనా అనంతరం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పనిసరి అని భావిస్తున్నవారు 46 శాతం

భారతీయ టెక్‌–ఫస్ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: జీవిత బీమా, హెల్త్‌ కవర్‌–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి.

కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్‌ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.  

ఇదీ అధ్యయనం...  
తాజాగా భారతీయ టెక్‌–ఫస్ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్‌ కవర్‌ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్‌లిమిటెడ్‌ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్‌ క్యాపింగ్‌ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది.   

మరిన్ని వార్తలు