హైదరాబాద్లో..మరో పెప్పర్ఫ్రై స్టోర్!

21 Oct, 2016 00:50 IST|Sakshi
హైదరాబాద్లో..మరో పెప్పర్ఫ్రై స్టోర్!

6 నెలల్లో దేశంలో మరో 10 స్టోర్ల ఏర్పాటు
ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధుల సమీకరణ
పెప్పర్‌ఫ్రై సీఎంఓ కశ్యప్ వాడపల్లి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా ఆన్‌లైన్ హోం ఫర్నిషింగ్ సేవలందిస్తున్న పెప్పర్ ఫ్రై వచ్చే ఆరు నెలల్లో దేశంలో మరో 10 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లో ఉన్న స్టోర్‌తో పాటు కొత్తగా గచ్చిబౌలిలో మరో స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కశ్యప్ వాడపల్లి చెప్పారు. మిగిలినవి బెంగళూరు, ముంబై, చండీగఢ్‌లలో రానున్నట్లు తెలిపారు. ‘పెప్పర్ ఫ్రై హోం ఫర్నీషింగ్ షాపింగ్ ట్రెండ్స్-2016’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో రూ.210 కోట్ల నిధులను సమీకరించామని, వీటితో కలిపి ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధులను సమీకరించామని తెలియజేశారు. మరో 12-18 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామన్నారు.

ప్రస్తుతం దేశంలో హోం ఫర్నిషింగ్ మార్కెట్ 25 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో సంఘటిత రంగ వాటా 10 శాతం కంటే తక్కువేనని తెలియజేశారు. ‘‘30 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. మరో 10 లక్షల మందికి ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై, జోధ్‌పూర్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో గిడ్డంగులున్నాయి. అన్నీ ఆటోమేటెడ్‌వే. ప్రస్తుతం మా సంస్థలో 10 వేల మంది వ్యాపారులు నమోదై ఉన్నారు. వీరిలో 3 వేల మందే క్రీయాశీలంగా ఉన్నారు’’ అని వివరించారు. షాపింగ్ ట్రెండ్స్ సర్వే గురించి మాట్లాడుతూ.. తమ కస్టమర్లలో 35 ఆపైన వయసున్న వారే ఎక్కువగా ఉన్నారని.. అన్ని ఆర్డర్లూ రాత్రి 9 గంటల తర్వాతే వస్తున్నట్లు తేలిందని చెప్పారు.

 హైదరాబాద్ నుంచి ఎక్కువగా కింగ్ సైజ్ బెడ్స్, చెన్నై నుంచి స్టైలిష్ ఫర్నిచర్, బెంగళూరు నుంచి స్టడీ ల్యాంప్స్, ఢిల్లీ నుంచి బ్రాండెడ్ ఫర్నిచర్, ముంబై నుంచి బార్ యూనిట్స్, కోల్‌కత్తా నుంచి బుక్ షెల్ఫ్స్, చండీగఢ్ నుంచి వాల్ షెల్ఫ్స్, గోవా నుంచి డైనింగ్ సెట్స్, మధురై నుంచి కాంటెంపరరీ ఫర్నిచర్, జైపూర్ నుంచి షాండ్లియర్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు సర్వేలో తేలిందన్నారు.

మరిన్ని వార్తలు