శామ్సంగ్ ప్రింటర్స్ వ్యాపారం హెచ్పీ గూటికి...

13 Sep, 2016 00:16 IST|Sakshi
శామ్సంగ్ ప్రింటర్స్ వ్యాపారం హెచ్పీ గూటికి...

బిలియన్ డాలర్లకు కొనుగోలు

 న్యూయార్క్: ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ కంపెనీ అతిపెద్ద కొనుగోలుకు తెరతీసింది. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ప్రింటర్స్ వ్యాపారాన్ని 1.05 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. 55 బిలియన్ డాలర్ల ఏ3 ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ స్థానం మరింత బలపడేందుకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది. ఈ డీల్‌లో భాగంగా 6,500కు పైగా ప్రింటర్ పేటెంట్లు సైతం హెచ్‌పీ పరం అవుతాయి.

అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులు హెచ్‌పీ గూటి కిందకు వస్తారు. వీరిలో 1,300 మంది ఇంజనీర్లు సైతం ఉన్నారు. శామ్‌సంగ్‌కు దక్షిణ కొరియాలో ప్రధాన ఇంజనీరింగ్ కేంద్రం ఉండగా, అమెరికా, భారత్, చైనా, జపాన్, రష్యా, కెనడా తదితర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌పీకి దేశీయంగా బెంగళూరులో ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉండగా, ప్రింటర్స్ విభాగంలో మొత్తం 2వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ డీల్ 12 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు. 

 ఈ డీల్ అనంతరం ఓపెన్ మార్కెట్ ద్వారా 10 నుంచి 30 కోట్ల డాలర్లను మూలధన పెట్టుబడిగా పెట్టేందుకు శామ్‌సంగ్ అంగీకరించినట్టు హెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రింటర్స్ విభాగంలో ఇది తమకు అతిపెద్ద కొనుగోలు అని, దీంతో కాపీయర్ విభాగంలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని హెచ్‌పీ ప్రకటించింది. ఐటీ సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన హ్యులెట్‌పేకర్డ్ నుంచి పది నెలల క్రితమే ప్రింటర్, కంప్యూటర్ల వ్యాపారం విడివడి హెచ్‌పీగా ఏర్పడింది. కంపెనీ లాభాల్లో అత్యధిక శాతం ప్రింటర్ ఇంక్, టోనర్ల విక్రయాల ద్వారానే వస్తోంది.

మరిన్ని వార్తలు