భారత్-అమెరికా సమాచార మార్పిడి ఒప్పందం

3 Jan, 2015 01:04 IST|Sakshi
భారత్-అమెరికా సమాచార మార్పిడి ఒప్పందం

బ్యాంకింగ్ రెగ్యులేటర్ల సంతకాలు...
 
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్ల ప్రతినిధులు ఫైనాన్షియల్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సంబంధించిన ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సహకారం మరింత పెంపొందించుకోవడం లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. ఆర్‌బీఐ, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ ఆఫీస్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మధ్య ఆర్థిక సమాచార మార్పడి సంబంధాలు ఈ ఒప్పందంతో మరింత బలపడనున్నాయి. ఈ తరహాలో (ఫైనాన్షియల్ సమాచార మార్పిడి) ఇప్పటి వరకూ ఆర్‌బీఐ వివిధ దేశాల ఫైనాన్షియల్ రెగ్యులేటర్లతో 22 ఒప్పందాలను చేసుకుంది.
 
 ఎన్‌బీఎఫ్‌సీ కేవైసీ నిబంధనలు సరళతరం


కాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) సంబంధించిన ‘నో-యువర్-కస్టమర్’ (కేవైసీ) నిబంధనలను ఆర్‌బీఐ సరళతరం చేసింది. హై రిస్క్ ఇండివిడ్యువల్స్, కంపెనీలకు సంబంధించి ఆయా కంపెనీలు కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ నిబంధలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్థాయి రిస్క్‌కు సంబంధించి ఈ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంది. మీడియం రిస్క్ విషయంలో ఈ కాలం ఎనిమిదేళ్లు. ఇప్పటివరకూ లో రిస్క్ విషయంలో ఈ కాలపరిమితి ఐదేళ్లుకాగా, హై, మీడియం రిస్క్ విషయంలో రెండేళ్లుగా ఉంది. కాగా ఆయా అప్‌డేషన్ సందర్భాల్లో కస్టమర్లు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం లేదని కూడా ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. మైనర్ కస్టమర్లు మేజర్ అయినప్పుడు కొత్త ఫొటోలు తీసుకోవాలని పేర్కొంది. లో రిస్క్ కస్టమర్ల విషయంలో ఆయా వ్యక్తులు గత చిరునామాలోనే నివసిస్తున్నట్లయితే, అందుకు తాజా ఆధారాలు అవసరం లేదని తెలిపింది.
 
 ప్రొడక్ట్‌పై కంపెనీ పేర్లకు ఆదేశం
 ఇదిలాఉండగా, వైట్ లేబుల్ ఏటీఎంలు, స్మార్ట్ కార్డులు, ఈ-వాలెట్ వంటి సేవలను అందించే కంపెనీలు తాము అందించే ఆయా ప్రొడక్టులపై  తమ కంపెనీల పేరును ప్రముఖంగా కనబడే లా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది. పారదర్శకత లక్ష్యంగా ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు