ఇన్ఫోసిస్ బోనస్ బొనాంజా

11 Oct, 2014 01:07 IST|Sakshi
ఇన్ఫోసిస్ బోనస్ బొనాంజా

1:1 నిష్పత్తిలో... ఒక షేరుకి మరో షేరు ఫ్రీ

అంచనాలను మించిన క్యూ2 ఫలితాలు...  నికర లాభం రూ. 3,096 కోట్లు..  వార్షికంగా 28.6 శాతం, త్రైమాసికంగా 7.3 శాతం వృద్ధి
ఆదాయం రూ.13,342 కోట్లు  ఈ ఏడాది ఆదాయ గెడైన్స్ 7-9% యథాతథం షేరుకి రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్

 
మా క్లయింట్లలో ప్రతిఒక్కరి వ్యాపారాల్లోనూ డిజిటల్ పరిజ్ఞానం వినియోగం జోరందుకుంటోంది. వాళ్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు, అదేవిధంగా కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఈ పరిణామం మాకు ఉపయోగపడనుంది. సాధ్యమైనంత వేగంగానే దీని ఫలితాలు అందుకోనున్నాం. భవిష్యత్తులో కంపెనీ వృద్ధికి ఇదే ప్రధాన చోదకంగా నిలవనుంది. మా సొంత వ్యాపారంలోకూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి వృద్ధిని పెంచుకుంటాం.

-విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ
 
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీకి తొలి నాన్-ప్రమోటర్ సీఈఓగా రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా.. తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. అనూహ్యరీతిలో బోనస్ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దీంతో షేరు ధర కూడా రివ్వుమంటూ 7 శాతం ఎగబాకింది.
 
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో మంచి పనితీరును కనబరిచింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,096 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,407 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక 28.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.13,342 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.12,965 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 2.9 శాతం పెరిగింది. నికర లాభం జోరుకు పటిష్టమైన ఆదాయం, నిర్వహణపరంగా మెరుగైన పనితీరు చేదోడుగా నిలిచాయని కంపెనీ పేర్కొంది.
 
సీక్వెన్షియల్‌గానూ...

ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ఇన్ఫీ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. దీంతో పోల్చి చూస్తే.. సీక్వెన్షియల్‌గా క్యూ2లో లాభం 7.3 శాతం ఎగసింది. ఇక క్యూ1 ఆదాయంతో పోలిస్తే(రూ.12,770 కోట్లు) జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 4.5 శాతం మెరుగుపడింది. మార్కెట్ వర్గాలు క్యూ2లో రూ.2,985 కోట్ల నికర లాభం, రూ.13,307 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. దీనికంటే మెరుగైన గణాంకాలను ఇన్ఫీ నమోదుచేయడం విశేషం.
 
గైడన్స్‌లో మార్పులేదు...
ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిల్‌లో ప్రకటించినట్లుగానే 7-9 శాతం గెడైన్స్(డాలర్ల రూపంలో)ను యథాతథంగా కొనసాగించింది. రూపాయిల్లో గెడైన్స్ 6.7-8.7 శాతంగా ఉంది.
 
ఇతర ముఖ్యాంశాలివీ...
జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇన్ఫీ, దాని సబ్సిడరీలు కొత్తగా 49 క్లయింట్లను దక్కించుకున్నాయి. దీంతో మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 912కి చేరింది.
ఇక సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతరత్రా నిల్వలు 5,444 మిలియన్ డాలర్లకు ఎగసింది. జూన్ చివరికి ఈ మొత్తం 4,943 మిలియన్ డాలర్లు.
బోనస్ షేర్లు, మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు ధర 7 శాతం మేర ఎగబాకి కొత్త రికార్డును(రూ.3,909) తాకింది. చివరకు 6.68 శాతం లాభంతో రూ.3,889 వద్ద స్థిరపడింది.
 
పెరిగిన ఉద్యోగుల వలస..
.
క్యూ2లో ఇన్ఫోసిస్ స్థూలంగా 14,255 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 10,128 మంది కంపెనీని వీడటంతో నికరంగా 4,127 మంది సిబ్బందే జతయ్యారు. దీంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 20.1 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆట్రిషన్ రేటు 17.3 శాతం కాగా.. ఈ ఏడాది క్యూ1లో 19.5 శాతం. మొత్తంమీద సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫోసిస్, దాని సబ్సిడరీ సంస్థలన్నింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 1,65,411కి చేరింది.
 
బోనస్ షేర్లు.. బంపర్ డివిడెండ్..

ఇన్ఫోసిస్ డెరైక్టర్ల బోర్డు తమ ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను ప్రకటించింది. ఒక్కో షేరుకి మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది.అదేవిధంగా న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఒక్కో అమెరికా డిపాజిటరీ షేరు(ఏడీఎస్)కు కూడా మరో ఏడీఎస్‌ను బోనస్‌గా ఇవ్వనుంది. బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో షేర్ల సరఫరా(లిక్విడిటీ)ని పెరగడంతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్యను కూడా పెంచేందుకు  దోహదం చేయనుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) రాజీవ్ బన్సల్ చెప్పారు.  

మరోపక్క, రూ.5 ముఖ విలువగల ఒకో షేరుపై ఆరు రెట్లు అధికంగా రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది క్యూ2లో మధ్యంతర డివిడెండ్ రూ.20 మాత్రమే కావడం గమనార్హం. కాగా, షేర్ల బైబ్యాక్ ద్వారా కంపెనీవద్దనున్న అదనపు క్యాపిటల్(నగదు నిల్వలను)ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ, బోర్డు సభ్యుడు మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. మార్కెట్ నుంచి షేర్లను కంపెనీ కొనుగోలు చేయడంద్వారా ఈక్విటీ తగ్గి.. పీఈ నిష్పత్తి(షేరు వారీ ఆర్జన) మెరుగవుతుందన్నారు. గతంలో కూడా బైబ్యాక్‌లు కంపెనీ పనితీరును పెంచాయని చెప్పారు. భారీ నగదు నిల్వలను ఏవిధంగా వెచ్చిస్తారో యాజమాన్యాన్ని వాటాదారులు అడగాలన్నారు. బ్యాలెన్స్‌షీట్లలో ఇంతపెద్ద మొత్తం నిరుపయోగంగా పడిఉంటే.. ఏదోఒకసమయంలో ఒత్తిడికిలోనై బడా కంపెనీని దేన్నైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు