ఐటీ డిజిటల్ సంతకాలకు కొత్త సాఫ్ట్ వేర్

27 Jan, 2016 01:12 IST|Sakshi
ఐటీ డిజిటల్ సంతకాలకు కొత్త సాఫ్ట్ వేర్

న్యూఢిల్లీ: డిజిటల్ సంతకాలతో కూడిన ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సులభతరంగా ఉండేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌తో ఐటీ రిటర్నులు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ప్రస్తుత ఈ-ఫైలింగ్ విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన దరిమిలా కొత్తది రూపొందించినట్లు వివరించింది.

లేటెస్టు బ్రౌజర్లు భద్రతాపరమైన కారణాల రీత్యా కొన్ని ప్లగ్‌ఇన్ లను అనుమతించకపోవడం వల్లే ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో సమస్యలు వస్తున్నాయని సీబీడీటీ పేర్కొంది. గూగుల్ క్రోమ్, మోజిల్లా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ల లేటెస్టు వెర్షన్లలో ఈ-ఫైలింగ్ వెబ్‌సైటు సరిగ్గా పనిచేయలేకపోతోందని వివరించింది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పన్ను చెల్లింపుదారులు తమ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం ఉపయోగించవచ్చని సీబీడీటీ తెలిపింది.

డిజిటల్ సంతకం చట్టం అమల్లో ఉన్న కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పన్ను రిటర్నుల ఈ-ఫైలింగ్ దాదాపు 27 శాతం ఎగిసింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 3.09 కోట్ల రిటర్నులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలయ్యాయి.

మరిన్ని వార్తలు