జప్తు చేసింది రూ.1.7 కోట్లే!

26 Oct, 2023 02:58 IST|Sakshi

రూ.59.93 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు..

అందులో లెక్కల్లేని నగదుగా రూ.1.7 కోట్లు ఉన్నట్లు నిర్ధారణ 

ఇప్పటికే యజమానులకు రూ.10.99 కోట్ల అప్పగింత 

ఆదాయ పన్నుల శాఖ డీజీ సంజయ్‌ బహదూర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్‌ ప్రాంత డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్వెస్టిగేషన్‌) సంజయ్‌ బహదూర్‌ వెల్లడించారు.

ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్‌లైన్‌ నంబర్‌ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్‌/టెలిగ్రామ్‌ నంబర్‌ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. 

అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన 
నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్‌ బహదూర్‌ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం.

వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్‌డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం.

ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈఎస్‌ఎంఎస్‌) అనే యాప్‌ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు