ఐటీ దాడులు: 22 బాక్సుల్లో రూ.42 కోట్లు

14 Oct, 2023 03:39 IST|Sakshi

బెంగళూరులో ఐటీ దాడులు.. 

కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్‌ ఇంట్లో పట్టివేత

తెలంగాణలో ఓట్లు కొనేందుకే కాంగ్రెస్‌ దాచిందంటున్న బీఆర్‌ఎస్‌

బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా సొత్తు బయటపడింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్‌ అశ్వత్తమ్మ, ఆమె భర్త ఆర్‌.అంబికాపతి, కూతురు, వారి బంధువుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంబికాపతి ఇంట్లో మంచం కింద దాచిన 22 పెట్టెల్లో రూ.42 కోట్ల రూ.500 నోట్ల కట్టలు బయటపడినట్లు ఐటీ శాఖ తెలిపింది.

త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి బెంగళూరు మీదుగా భారీగా డబ్బును హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులోని అశ్వత్తమ్మ కుటుంబీకులకు చెందినలో ఆర్‌టీ నగర్‌ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.42 కోట్ల లభ్యమైనట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అఖండ్‌ శ్రీనివాసమూర్తికి అశ్వత్తమ స్వయానా సోదరి. అశ్వత్తమ భర్త ఆర్‌.అంబికాపతి బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయనే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికీ 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు ఎన్నికల అస్త్రంగా మారాయి. మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలుకాగా , కాంగ్రెస్‌ భారీ మెజారిటీ సాధించింది.

బీఆర్‌ఎస్‌ ఆరోపణలు..
తెలంగాణ ట్యాక్స్‌ పేరుతో బిల్డర్లు, బంగారం వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.1,500 కోట్లను కాంగ్రెస్‌ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పంపుతోందని తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్‌ ఇటీవల ఆరోపించింది. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ డబ్బును భారీగా వెదజల్లుతోంది. టిక్కెట్లు సైతం అమ్ముకుంటోంది’అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌ కోట్ల రూపాయలను పంపుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సైతం ఆరోపణలు చేశారు.  

మరిన్ని వార్తలు