టెల్కోలకు షాక్‌: జియో మరో యుద్ధం

17 Oct, 2017 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో మరో యుద్ధానికి తెరతీయబోతుంది. ఇప్పటికే టెల్కోలకు ముప్పు తిప్పలు పెడుతున్న జియో, తాజాగా ఇంటర్నేషనల్‌ కాల్స్‌పై కూడా యుద్ధానికి దిగబోతుంది. అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్ల(ఐటీఆర్‌)ను నిమిషానికి 6 పైసలు, తర్వాత జీరోకి తీసుకురావాలని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, టెలికాం రెగ్యులేటరీని కోరుతోంది. ప్రస్తుతమున్న ఛార్జీలను 53 పైసల నుంచి రూ.1కి పెంచాలని జియో ప్రత్యర్థి కంపెనీలు కోరుతున్న క్రమంలో జియో ఈ మేర అభ్యర్థనను టెలికాం రెగ్యులేటరీ ముందుంచడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను ట్రాయ్‌, 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 నాటికి వాటిని జీరో చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో టెల్కోలు భారీ రెవెన్యూలను కోల్పోతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్లను కూడా జియో తగ్గించాలని కోరడం టెల్కోలను మరింత నష్టాల్లోకి దిగజార్చనుంది. అంతర్జాతీయ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ద్వారా రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు వస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు 60 శాతానికి పైగా దేశీయ వైర్‌లెస్‌ యూజర్‌ బేస్‌ను కలిగి ఉన్నాయి. దీంతో ఐటీఆర్‌ రేట్లను తగ్గించడం, టెలికాం కంపెనీలను మరోసారి భారీగా దెబ్బకొట్టనుందని తెలుస్తోంది. ఈ రేటును ఫారిన్‌ క్యారియర్‌, స్థానిక ఆపరేటర్‌కు చెల్లిస్తారు. ఓటీటీ కాల్స్‌(వాట్సాప్‌ కాల్స్‌, ఫేస్‌టైమ్‌ ఆడియో..) పాపులారిటీ పెరిగిపోతుండటంతో, జియో ఐటీఆర్‌ రేట్లను తగ్గించాలని కోరుతోంది. ఐటీఆర్‌ రేట్లు తగ్గితే, భారత్‌కు చేసే కాల్స్‌ రేట్లు కూడా తగ్గిపోనున్నాయి.      
 

మరిన్ని వార్తలు