జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది..

20 Sep, 2023 02:35 IST|Sakshi

హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో ఆవిష్కరణ 

రూ. 599 నుంచి ప్లాన్లు ప్రారంభం 

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా జియో ఎయిర్‌ఫైబర్‌ సర్విసులను ఆవిష్కరించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. వైర్‌లెస్‌ విధానంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సర్విసులను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్స్‌ ధరలు స్పీడ్‌ను బట్టి రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి. వినాయక చవితి కల్లా వీటి సేవలను ప్రవేశపెడతామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జియో ఇప్పటికే ఫైబర్‌ పేరిట బ్రాడ్‌బ్యాండ్‌ సర్విసులను అందిస్తోంది. ఇది ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వైర్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుండగా.. ఎయిర్‌ఫైబర్‌ వైర్‌లెస్‌ తరహాలో నెట్‌ను పొందడానికి ఉపయోగపడుతుంది. ‘మా ఫైబర్‌–టు–ది–హోమ్‌–సర్వీస్‌ జియోఫైబర్‌ ఇప్పటికే 1 కోటి మిందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి నెల వేల కనెక్షన్లు కొత్తగా జతవుతున్నాయి. ఇంకా అసంఖ్యాక గృహాలు, చిన్న వ్యాపారాలకు వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించాల్సి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్‌ ఇందుకు తోడ్పడనుంది.

విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌హోమ్‌ వంటి సొల్యూషన్స్‌తో ఇది కోట్ల గృహాలకు ప్రపంచ స్థాయి డిజిటల్‌ వినోదం, స్మార్ట్‌హోమ్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించగలదు‘ అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. జియోకు 15 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల వైర్‌లైన్‌ వేయడంలో ప్రతిబంధకాల కారణంగా పూర్తి స్థాయిలో విస్తరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జియోఎయిర్‌ఫైబర్‌ ఆ సవాళ్లను అధిగమించి, యూజర్లకు ఇంటర్నెట్‌ను చేరువ చేయడానికి ఉపయోగపడనుంది. జియోఫైబర్‌ ప్లాన్లు, ఎటువంటి మార్పు లేకుండా స్పీడ్‌ను బట్టి రూ. 399 నుంచి రూ. 3,999 వరకు రేటుతో యథాప్రకారం కొనసాగుతాయని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తెలిపింది. 

ప్రత్యేకతలివీ.. 
ఎయిర్‌ఫైబర్‌ కేటగిరీలో అపరిమిత డేటాతో, స్పీడ్‌ 30 నుంచి 100 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుంది. నెలవారీ ప్లాన్ల ధరలు రూ. 599 నుంచి రూ. 1,199 వరకు ఉంటాయి. ప్లాన్‌ను బట్టి 550 పైగా డిజిటల్‌ టీవీ చానళ్లు, 14 పైచిలుకు యాప్స్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. 
ఎయిర్‌ఫైబర్‌ మ్యాక్స్‌ కేటగిరీలో డేటా స్పీడ్‌ 300 నుంచి 1000 ఎంబీపీఎస్‌ వరకు (అపరిమితం) ఉంటుంది. ధర రూ. 1,499 నుంచి రూ. 3,999 వరకు ఉంటుంది. 550 పైగా డిజిటల్‌ టీవీ చానళ్లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ తదితర 14 పైగా ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉంటాయి.  
♦ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఫై రూటర్, 4కే స్మార్ట్‌ సెట్‌టాప్‌ బాక్స్, వాయిస్‌ యాక్టివ్‌ రిమోట్‌ లభిస్తాయి.

మరిన్ని వార్తలు