వరంగల్లో సైయంట్ సెంటర్

19 Feb, 2016 00:38 IST|Sakshi
వరంగల్లో సైయంట్ సెంటర్

యాపిల్ నుంచి జూన్‌లో అధికారిక ప్రకటన
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైయంట్ వరంగల్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంస్థకు ఇది నాల్గవదని సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సైయంట్ ప్రతిపాదిత సెంటర్‌కు సీఎం కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన జరుగనుందని తెలియజేశారు. రానున్న 12-18 నెలల్లో ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ స్థాయి కంపెనీ ద్వితీయ శ్రేణి నగరంలో కార్యాలయాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. మరిన్ని పెద్ద కంపెనీలు సైయంట్‌ను అనుసరిస్తాయని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 యాపిల్ నుంచి జూన్‌లో ప్రకటన..
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తెలంగాణలో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. యాపిల్‌కు చెందిన అధికారుల బృందం ప్రభుత్వాన్ని కలిసింది కూడా. నానక్‌రామ్‌గూడలో టి స్మన్ స్పియర్స్‌కు చెందిన భవనంలో యాపిల్ తన కార్యాలయాన్ని నెలకొల్పనుంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన జూన్‌లో వెలువడుతుందని కేటీఆర్ వెల్లడించారు. కాగా, జూన్ నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు.

 

>
మరిన్ని వార్తలు