పసిడి విలువను అర్థం చేసుకోవడం ఎలా? గోల్డ్‌ లోన్‌ గురించి తెలుసుకుందామా..

4 Dec, 2023 07:59 IST|Sakshi

శతాబ్దాలుగా అనేక సంస్కృతుల్లో సమృద్ధి, సంపదకు పర్యాయపదంగా పసిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆర్థిక భద్రతకు విశ్వసనీయమైన సాధనంగా కూడా ఉంటోంది. పసిడితో ప్రయోజనాలు పొందే మార్గాల్లో బంగారం రుణం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో బంగారం రుణాలను డీకోడ్‌ చేసేందుకు, పసిడి విలువను తెలియజెప్పేందుకు ప్రయత్నమే ఈ కథనం. పసిడి ఆభరణాలను (18–24 క్యారట్ల స్వచ్ఛత కలిగినవి) తనఖా పెట్టి తీసుకునే రుణాలను గోల్డ్‌ లోన్‌గా వ్యవహరిస్తారు. సురక్షితమైన గ్యారంటీగా పరిగణిస్తారు కాబట్టి మిగతా అన్‌సెక్యూర్డ్‌ రుణాలతో పోలిస్తే గోల్డ్‌ లోన్‌ను వేగవంతంగా, సులభతరంగా పొందవచ్చు.  

పసిడి విలువను అర్థం చేసుకోవడం..
తక్షణ లిక్విడిటీ: ఇతర అసెట్లతో పోలిస్తే బంగారాన్ని వేగంగా లిక్విడేట్‌ చేయొచ్చు. అంటే దాన్ని సత్వరం విక్రయించి నగదు పొందవచ్చు లేదా తనఖా ఉంచి రుణాన్నీ తీసుకోవచ్చు. ఈ లిక్విడిటీ కారణంగానే బంగారాన్ని తనఖా పెట్టినప్పుడు ఆర్థిక సంస్థలు రుణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుంటాయి.

రుణ పరిమాణం విషయంలో సౌలభ్యత: సాధారణంగా బంగారం విలువలో నిర్దిష్ట శాతంగా రుణ మొత్తం ఉంటుంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీ పసిడి క్రెడిట్‌ విలువ కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గరున్న బంగారం విలువను తరచుగా మదింపు చేసుకుంటూ ఉంటే వాటిపై ఎంత రుణం లభించే అవకాశం ఉంటుందనేది తెలుసుకోవచ్చు.
  
వడ్డీ రేటు తక్కువ: బంగారం రుణాలు సురక్షితమైనవి కావడంతో రుణదాతలకు రిస్కు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు వీలుంటుంది. అయితే, ఇది రుణమిచ్చే సంస్థ, లోన్‌–టు–వేల్యూ నిష్పత్తి ప్రకారం మారుతుంటుంది.
 
క్రెడిట్‌ స్కోరుపరమైన ప్రయోజనాలు: క్రెడిట్‌ హిస్టరీ లేనివారికి లేక క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నవారికి బంగారం రుణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రెడిట్‌ హిస్టరీ పెద్దగా లేకపోయినా బంగారంపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించేస్తే మీ క్రెడిట్‌ స్కోరుపైనా సానుకూల ప్రభావం ఉండగలదు.

రీపేమెంటులో సౌలభ్యం: చాలా మటుకు సంస్థలు నెలావారీగా చెల్లింపులు, వడ్డీని ముందస్తుగా కట్టి.. అసలును ఆఖర్లో కట్టడం లాంటి వివిధ రకాల రీపేమెంట్‌ ఆప్షన్స్‌ ఇస్తున్నాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు ..
బంగారంపై రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలూ కొన్ని ఉన్నాయి. అవేమిటంటే...

ధరల్లో హెచ్చుతగ్గులు: బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. రేటు భారీగా పడిపోయిందంటే రుణాలిచ్చిన సంస్థలు మరింత ఎక్కువ విలువైన వాటిని తనఖా పెట్టాలని అడగొచ్చు లేదా వ్యత్యాసాన్ని చెల్లించమని అడగొచ్చు.

విలువ–రుణ నిష్పత్తి: బంగారం పూర్తి రేటుపై బ్యాంకులు రుణాలివ్వవు. పసిడి విలువలో నిర్దిష్ట శాతం మాత్రమే ఇస్తాయి. ఇది బ్యాంకు, నియంత్రణ నిబంధనలను బట్టి 60–90 శాతంగా ఉండొచ్చు.

భద్రత: మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచేలా రుణాలిచ్చే సంస్థ తగిన భద్రతా చర్యలు తీసుకుంటోందా లేదా చూసుకోవాలి. చివరిగా చెప్పేదేమిటంటే బంగారమనేది అలంకారానికి, ఏళ్లకు ఏళ్లు లాకర్లలో భద్రపర్చుకునేందుకు మాత్రమే పరిమితమైనది కాదు. సరిగ్గా వాడుకుంటే ఆర్థిక సమస్యల వేళ ఎంతగానో ఉపయోగపడగలదు. అయితే, మిగతా అన్ని ఆర్థిక సాధనాల్లాగే బంగారం రుణాల షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం, మెరుగైన డీల్‌ లభించేలా చూసుకోవడం ముఖ్యం.

>
మరిన్ని వార్తలు