చొక్కా రంగును బట్టి లైటింగ్!

26 Apr, 2014 03:58 IST|Sakshi
చొక్కా రంగును బట్టి లైటింగ్!

 సాక్షి, హైదరాబాద్:   గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్.. బయటికి వెళ్లిపోగానే ఆఫ్ అవుతాయి!
 రోజును, మన మూడ్‌ను బట్టి గదిలోని లైట్ రంగును మార్చుకోవచ్చు!
 మనం ఏ రంగు చొక్కా వేసుకుంటే లైట్ కూడా అదే రంగు కాంతిని వెదజల్లుతుంది!
 ఇంట్లో వేసి ఉన్న లైట్లను సెల్‌ఫోన్ల నుంచి ఆపరేట్ చేయవచ్చు!
 టీవీ సౌండ్ పెంచినట్టుగా లైటింగ్‌ను కూడా ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు!

 .. అరే ఏంటివి అనుకుంటున్నారా? లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) లైట్ల వింతలండి. రోజుకో కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి విడుదలవుతున్న ఎల్‌ఈడీ లైట్ల విశేషాలపై ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్ (ఐఎస్‌ఎల్‌ఈ) ఏపీ చాప్టర్ చైర్మన్, లైటింగ్ కన్సల్టెంట్ డీ కృష్ణశాస్త్రితో ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేకంగా మాట్లాడింది.

 మరిన్ని ఆసక్తికర విషయాలివిగో..
 రోజును బట్టి ఇంట్లో లైట్ రంగును మార్చుకోవాలనే అభిరుచి నగరవాసుల్లో బాగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ఒకే ఎల్‌ఈడీ లైట్‌తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్‌ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్‌లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్‌లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు.

 సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్..
 ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్‌ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్  సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎల్‌ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్‌ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, షామింగ్ మాల్స్‌లో వినియోగిస్తుంటారు.

 ధర ఎక్కువైనా..
 బల్బు, సీఎఫ్‌ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్‌ఈడీ లైట్ ధర రూ. 1,500-1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాల్‌కు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది.

 నెలకు రూ.7 కరెంట్ బిల్లు..
 ఎల్‌ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువగా తీసుకుంటాయి. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో యూనిట్ విద్యుత్‌కు రూ. 1.45 పైసలుగా ఉంది) ట్యూబ్‌లైట్ విషయానికొస్తే.. నెలకు 21 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్‌ఈడీ లైట్‌కు అయితే నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసలు మాత్రమే కరెంట్ బిల్లు  వస్తుందన్నమాట.

 లాభాలెన్నో..
   ఎల్‌ఈడీ లైట్‌కు 5 ఏళ్ల పాటు గ్యారెంటీ ఉంటుంది.   బల్బును నిరంతరాయంగా 500 గంటల పాటు వేసి ఉంచితే పాడవుతుంది. ట్యూబ్‌లైట్ అయితే వెయ్యి గంటలు, కానీ ఎల్‌ఈడీ లైట్‌ను నిరంతరాయంగా 25 - 50 వేల గంటల పాటు వేసి ఉంచినా ఏం కాదు.

   అవసరానికి తగ్గట్టుగా ఎల్‌ఈడీ లైట్ల వెలుతురు (లుమిన్స్)ను తగ్గించుకోవచ్చు.

   ఒకే ఎల్‌ఈడీ లైట్‌ను మనకు కావాల్సిన రంగు ఎల్‌ఈడీ లైట్‌గా మార్చుకోవచ్చు.
 
 యూనిట్ విద్యుత్ వినియోగం
 వస్తువు     ఓల్టులు                   విద్యుత్
 బల్బు       100                         11 గంటలు
 ట్యూబ్‌లైట్    52(ట్యూబ్+చౌక్)        21 గంటలు
 ఎల్‌ఈడీ       18                        60 గంటలు

 

మరిన్ని వార్తలు