నకిలీ వార్తలపై వాట్సాప్‌ చీఫ్‌ వాగ్దానం

21 Aug, 2018 18:10 IST|Sakshi

న్యూఢిల్లీ : వాట్సాప్‌ చీఫ్‌ క్రిష్‌ డేనియల్స్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఐదు రోజుల పర్యటన సందర్భంగా ఆయన భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. వాట్సాప్‌లో విస్తృతంగా వ్యాపించిన నకిలీ వార్తలతో కేంద్ర మంత్రి, వాట్సాప్‌ అధినేతతో చర్చించారు. వాట్సాప్‌ ద్వారా తప్పుడు సమాచారం సృష్టించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చేస్తే.. తప్పక చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ హామీ ఇచ్చినట్టు రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. వాట్సాప్‌ నకిలీ వార్తలతో ఇటీవల 20కి పైగా వ్యక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మూకదాడులు, రివెంజ్‌ పోర్న్‌ వంటి నేరాలను ఇవి ప్రేరేపిస్తున్నాయని.. దేశీయ క్రిమినల్‌ చట్టాలను ఉల్లంఘించే ఈ సవాళ్లకు వెంటనే పరిష్కారాలు కనుగొనాలని మంత్రి, డేనియల్స్‌కు సూచించారు. అంతేకాక, సమస్యల పరిష్కార ఆఫీసర్‌ను కూడా నియమించాలని వాట్సాప్‌ అధినేతను మంత్రి డిమాండ్‌ చేశారు. అంతేకాక దేశంలో ఓ కార్పొరేట్‌ ఆఫీసును తెరవాలని కోరారు. 

దేశీయ చట్టాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ.. వాట్సాప్‌ను దుర్వినియోగ పరచకుండా ప్రజా అవగాహన కార్యకలాపాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భారత ప్రభుత్వం కోరిన అన్ని అభ్యర్థనలను నెరవేరుస్తామని  తాము హామీ ఇస్తున్నట్టు వాట్సాప్‌ చీఫ్‌ చెప్పారు. కాగ, గత కొన్ని నెలల్లో వాట్సాప్‌ ద్వారా విస్తరించిన నకిలీ వార్తలతో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మూక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇవి కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారాయి. నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్‌ యజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌కు రెండు నోటీసులు కూడా జారీచేసింది. తప్పుడు సమాచారంపై పోరుకు 50వేల డాలర్ల రీసెర్చ్‌ గ్రాంట్లను కూడా సోషల్‌ సైంటిస్టులకు కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. అదేవిధంగా ఈ మెసేజ్‌లు ఎక్కడ నుంచి ఫార్వర్డ్‌ అయ్యాయో కూడా వాట్సాప్‌ తెలుసుకోవాలని కేంద్ర ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఆదేశించింది.   
 

>
మరిన్ని వార్తలు