మెర్సిడెస్ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ

16 Apr, 2014 01:08 IST|Sakshi
మెర్సిడెస్ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ

 ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ), జీఎల్ 63 ఏఎంజీని మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.66 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లోకి తెస్తున్న ఏఎంజీ రేంజ్ వాహనాల్లో ఇది మొదటిదని పేర్కొన్నారు.  దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 5.5 లీటర్ వీ8 బైటర్బో పవర్ ట్రైన్‌తో రూపొందిన ఈ కారు 0-100 కి.మీ. వేగాన్ని 4.6 సెకన్లలో అందుకుంటుంది. 7 గేర్లు (ఆటోమేటిక్), ఆల్ వీల్ డ్రైవ్, మూల మలుపులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసేలా యాక్టివ్ కర్వ్ కంట్రోల్, బాంగ్ అండ్ ఓలుఫ్‌సెన్ ఆడియా సిస్టమ్, సిరస్ శాటిలైట్ రేడియో, పనోరమిక్ సన్‌రూఫ్, ట్రై జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌కు ఈ కొత్త మెర్సిడెస్ ఎస్‌యూవీ గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా.

 ఈ ఏడాది 10 మోడళ్లు
 కాగా ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 10 కొత్త మోడళ్లను అందించనున్నామని కెర్న్ వివరించారు. ఈ కారు తమ వినియోగదారులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది తమ అమ్మకాలు 32 శాతం వృద్ధి చెంది 9,003కు చేరాయని వివరించారు. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి అమ్మకాలు 27 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని వివరించారు. పుణేలోని చకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఎస్, ఈ, సీ, జీఎల్, ఎం- క్లాస్ మోడల్ కార్లను భారత్‌లోనే తయారు చేస్తోంది. ఏ, సీఎల్‌ఎస్, ఎస్‌ఎల్‌కే-క్లాస్, లగ్జరీ టూరర్ బి-క్లాస్, లగ్జరీ ఎస్‌యూవీ జీఎల్ 63 ఏఎంజీలను దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు