192 బిలియన్‌ డాలర్లకు ఐటీ ఆదాయాలు

13 Feb, 2020 06:33 IST|Sakshi

2019–20పై నాస్కామ్‌ అంచనా

డిజిటల్‌ ఆదాయాల ఊతం

ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ–బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019–20లో కొత్త తరం డిజిటల్‌ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని నాస్కామ్‌ వివరించింది.

భవిష్యత్‌ అంచనాలకు సంబంధించి పరిశ్రమ ఆశావహంగానే ఉన్నప్పటికీ కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణే కొనసాగించనున్నట్లు నాస్కామ్‌ చైర్మన్‌ కేశవ్‌ మురుగేశ్‌ విలేకరులకు తెలిపారు. 43.6 లక్షల మంది సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాలు కచ్చితంగా ఎంత స్థాయిలో ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు చెప్పారు. అయితే, సరఫరా వ్యవస్థలో చైనా కీలక దేశం కావడంతో క్లయింట్లపైనా, ఫలితంగా పరిశ్రమపైనా పరోక్ష ప్రభావాలు ఉండొచ్చన్నారు.

మెషీన్‌ లెర్నింగ్‌తో ప్రయోజనమే: చంద్రశేఖరన్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి టెక్నాలజీలు..  భారత్‌ వంటి వర్ధమాన దేశాలకు ప్రయోజనకరమేనని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు