రెడ్డీస్‌ చేతికి వొకార్డ్‌ జనరిక్స్‌

13 Feb, 2020 06:30 IST|Sakshi

డీల్‌ విలువ రూ.1,850 కోట్లు

మొత్తం 62 బ్రాండ్ల్ల కొనుగోలు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌.. ఇదే రంగంలోని వొకార్డ్‌కు చెందిన కొన్ని విభాగాల బ్రాండెడ్‌ జనరిక్స్‌ దేశీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ బుధవారం వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్టీవుల బిజినెస్‌ను సైతం చేజిక్కించుకోనుంది. డీల్‌ విలువ రూ.1,850 కోట్లు. డీల్‌ ద్వారా వొకార్డ్‌కు చెందిన 62 బ్రాండ్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పరంకానున్నాయి.

శ్వాసకోస, కేంద్ర నాడీ మండల, చర్మ, జీర్ణకోశ, నొప్పుల విభాగాలకు చెందిన పలు బ్రాండ్లను రెడ్డీస్‌ సొంతం చేసుకోనుంది. వొకార్డ్‌కు చెందిన అమ్మకాలు, మార్కెటింగ్‌ టీమ్‌లతో పాటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలో గల తయారీ ప్లాంటు సైతం డాక్టర్‌ రెడ్డీస్‌కు దక్కుతుంది. స్లంప్‌సేల్‌ ప్రాతిపదికన ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు రెడ్డీస్‌ వెల్లడించింది. భారత మార్కెట్‌ తమకు ముఖ్యమని, వొకార్డ్‌ వ్యాపారాల కొనుగోలుతో ఇక్కడ మరింత విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. తాజా కొనుగోలుతో అధిక వృద్ధికి ఆస్కారమున్న విభాగాలలో కంపెనీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు.  

మరిన్ని వార్తలు