‘సెల్ఫీ’ ఉద్యోగాలొచ్చాయ్!

23 Feb, 2016 21:53 IST|Sakshi
‘సెల్ఫీ’ ఉద్యోగాలొచ్చాయ్!

ఉద్యోగ నియామకాల్లో సరికొత్త ట్రెండ్
సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూలతో ఎంపిక
నియామక ప్రక్రియలో 40% పని వీటి ద్వారానే
మార్కెటింగ్‌లోనూ సెల్ఫీ కామెంట్లు, వీడియోలు
దీంతో సగం వ్యయం తగ్గుతుందంటున్న సంస్థలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్వ్యూ. ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనగానే... విద్యార్హతల నుంచి వేసుకునే దుస్తులు, పడాల్సిన టెన్షన్ వరకూ అన్నిటికీ ఓ లెక్కుంది. బోర్డులో ఎవరుంటారో? ఏ ప్రశ్నలడుగుతారో? అనే టెన్షన్‌తో పాటు ఫార్మల్ ప్యాంట్, ప్లెయిన్ షర్ట్ వేసుకొని నీట్‌గా టక్ చేసుకొని.. వీలైతే ఓ కోటు... చేతిలో సర్టిఫికెట్లు... ఇవన్నీ కాక రెజ్యుమె. అన్నీ ఉంటేనే ఇంటర్వ్యూ బాగా చేయగలమనే నమ్మకం వస్తుంది. కానీ, ఇప్పుడంతా స్మార్ట్ కాలమాయె. అందుకే!! డ్రెస్సే కాదు,  సర్టిఫికెట్లు కూడా అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన పనే లేదు. అంతా అరచేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచే చేసెయ్యొచ్చు. అదే సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూ!! ఇందుకోసం కొన్ని స్టార్టప్ కంపెనీలు మార్కెట్లోకి సరికొత్త యాప్‌లను విడుదల చేశాయి కూడా.

 సెల్ఫీల వినియోగం ఇపుడు జాబ్ రిక్రూట్‌మెంట్లలోకి పాకింది. రిక్రూట్‌మెంట్ల సమాచారం తెలిపే నౌక్రీ, కెరీర్ బిల్డర్, షైన్ వంటి సంస్థలు తమ వద్ద రిజిస్టర్ అయిన నిరుద్యోగులను తమ విద్యార్హతలు, రెజ్యుమెతో పాటు సెల్ఫీ వీడియోలను కూడా అప్‌లోడ్ చేయమని కోరుతున్నాయి. ఇందులో ఉద్యోగార్థులు స్మార్ట్‌ఫోన్ ముందు తమ అర్హతలు, హాబీలు, గత ఉద్యోగ అనుభవాలు, ప్రస్తుతం ఉద్యోగ అవసరాలు వంటి వివరాలు క్లుప్తంగా, సూటిగా వివరించాలి. ఈ వీడియో నిడివి 60 సెకన్లుంటుంది. ఇది పూర్తవగానే సంబంధిత సెల్ఫీ వీడియో లింక్ నేరుగా ఆయా కంపెనీలకు వెళ్లిపోతుంది. దీంతో కంపెనీ నియామక ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉద్యోగ నియామకాల్లో, మార్కెటింగ్ కార్యకలాపాల్లో సెల్ఫీ రెజ్యుమె, సెల్ఫీ వీడియోల ట్రెండ్ ఎక్కువైందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యాపీమైండ్స్’ నిర్వాహకులు లీలాధర్ చెప్పారు. ఆతిథ్యం, పర్యాటకం, మార్కెటి ంగ్, మోడలింగ్, ఈ-కామర్స్ రంగాల్లో సెల్ఫీ వీడియో ద్వారా ఉద్యోగ భర్తీ బాగా జరుగుతున్నట్లు తెలియజేశారు.

 కంపెనీలకు ఏం లాభమంటే..
సెల్ఫీ వీడియో వచ్చాక నియామక కంపెనీలకు ఉద్యోగ నోటిఫికేషన్, ప్రకటనలు, నియామక ప్రక్రియ వంటి ఇబ్బందులు తప్పుతున్నాయి. వీటికోసమయ్యే వ్యయం కూడా తగ్గుతోంది. నియామక ప్రక్రియలో 40% పనిని సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూలతో పూర్తి చేస్తున్నట్లు ‘మైండ్‌షిఫ్’్ట సీఈఓ జాఫర్ రాయిస్ చెప్పారు. సెల్ఫీ వీడియో ద్వారా ఉద్యోగార్థి ఆత్మ విశ్వాసం, భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి తక్కువ సమయంలోనే తెలుసుకునే వీలుంటుంది. సెల్ఫీ రెజ్యూమ్స్‌తో నకిలీ ప్రొఫైల్స్ భాద కూడా తప్పుతుంది. జేడబ్ల్యూ మారియట్ సంస్థ ఫ్రంట్ ఆఫీస్, మార్కెటింగ్ విభాగాల్లో ఏటా 70-80 ఉద్యోగాలను సెల్ఫీ రెజ్యూమె, వీడియోల ద్వారానే భర్తీ చేసుకుంటోంది. డిజిటల్ మార్కెటింగ్ సంస్థ మైండ్‌షిఫ్ట్‌దీ ఇదే దారి. ‘‘ఇప్పుడు మేం సెల్ఫీ రెజ్యూమెతో పాటు సెల్ఫీ షార్ట్ వీడియోలను కూడా అప్‌లోడ్ చేయాలని నిరుద్యోగులను కోరుతున్నాం. వాటిని వాట్సాప్ లేదా ఈ- మెయిల్ ద్వారా పంపొచ్చు’’ అని జాఫర్ రాయిస్ చెప్పారు.

‘స్మార్ట్’తో లాభమేంటి..?
అభ్యర్థుల మనస్తత్వాన్ని అంచనా వేయటానికే ఫోన్ ఇంటర్వ్యూలన్నది హెచ్‌ఆర్ నిపుణుల మాట. ‘‘దీనివల్ల ఆ సంస్థలో పనిచేయడానికి అభ్యర్థి నిజంగా ఆసక్తి చూపిస్తున్నాడా? కంపెనీ గురించి ప్రాథమిక సమాచారం సేకరించే ప్రయత్నం చేశారా? భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎలా ఉంది? ఇవన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి’’ అని బెంగళూరుకు చెందిన ఈ-పాయిస్ సంస్థ సీఈఓ సచిన్ అగర్వాల్ చెప్పారు. స్మార్ట్ ఇంటర్వ్యూ యాప్‌ను ఈ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. ఓలా, రెడ్‌బస్, ఫ్లిప్‌కార్ట్, బుక్ మై షో సంస్థలు తమ సేవల్ని వినియోగించుకుంటున్నాయని చెప్పరాయన. ‘‘ఈ యాప్‌తో కేవలం హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరు, పుణె, చెన్నై దేశవ్యాప్తంగా ఏ కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి? ఏ హోదాలో నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి? జీతభత్యాలెంత? వంటి సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు’’ అని సచిన్ చెప్పారు. మార్కెటింగ్‌లోనూ సెల్ఫీ వీడియో హవా నడుస్తోంది. ఉత్పత్తుల పనితీరును సెల్ఫీతో వివరించటం, కొనుగోలుదార్ల సెల్ఫీ అభిప్రాయడాలను పోస్ట్ చేయటం వంటివి కంపెనీలు చేస్తు న్నాయి. వీటివల్ల ఖర్చు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

సెల్‌ఫోన్ నుంచే ఇంటర్వ్యూ..
సాధారణ ఇంటర్వ్యూల మాదిరిగా ప్రాంతం, తేదీ సమయం వంటివి స్మార్ట్ ఇంటర్వ్యూల్లో ఉండవు. ఇది కేవలం మొబైల్ నుంచే జరిగిపోతుంది. అదెలాగంటే ముందుగా స్మార్ట్ ఇంటర్వ్యూ సేవలందించే సంస్థల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, చిరునామా, ఫోన్ నంబర్, రెజ్యూమె వంటి వివరాలను తొలుత నమోదు చేసుకోవాలి. అపుడు రిక్రూట్‌మెంట్ ఉన్న కంపెనీల సమాచారం, ఉద్యోగ భర్తీ, నోటిఫికేషన్లు వంటి వివరాలు నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళ్లిపోతాయి. ఆ యాప్ నుంచే తమ రెజ్యుమెను నేరుగా కంపెనీలకు పంపొచ్చు. ఆ తర్వాత కంపెనీలు అభ్యర్థికి ముందే సమాచారం ఇచ్చి కాల్ చేస్తాయి. మరికొన్ని కంపెనీలు ఊహించని విధంగా ఫోన్ చేస్తుంటాయి. ఫోన్ ఎప్పుడు మోగుతుందో తెలియదు కనక అభ్యర్థులు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటే మంచిది. ‘‘సడెన్‌గా కాల్ వచ్చి మీరు ప్రయాణంలో ఉన్నా, మరే ఇతర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేసినవారి నంబర్, పేరు తీసుకోండి. మరో పది నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తానని రిక్వెస్ట్ చేయండి’’ అని హెచ్‌ఆర్ నిపుణుడొకరు సూచించారు.

>
మరిన్ని వార్తలు