CEOs Secret WhatsApp chat: ‘శామ్‌ అవుట్‌’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్‌ వాట్సాప్‌ చాట్‌

13 Dec, 2023 12:21 IST|Sakshi

చాట్‌ జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు వ్యవహారం టెక్‌ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్‌బర్గ్, డ్రూ హ్యూస్టన్‌లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్‌ చాట్‌ గ్రూప్‌లో హల్‌చల్‌ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఓపెన్‌ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్‌ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్‌ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్‌ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్‌తో సహా యూఎస్‌లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశం వచ్చింది.

ఇంతకీ ఏంటది?
సీఈవోల వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్‌ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్‌ ఆల్ట్‌మన్‌ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. 

సత్య నాదెళ్లకు అర్జెంట్‌ కాల్‌!
ఓపెన్‌ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్‌లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్‌కి ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్‌ చాట్‌లో ఉంది. ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్‌ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్‌గా ఉండనున్నట్లు ఆ కాల్‌లో ఆమె స్కాట్‌తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు.

దీంతో స్కాట్‌ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్‌ కాల్‌ చేశారట. ఆ సమయంలో ఆయన  రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంలో ఉన్నారు.  ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్‌ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్‌ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్‌ సందేశాల ద్వారా తెలుస్తోంది. 

అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్‌ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్‌ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్‌మన్‌ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్‌ సందేశాల సారాంశం.

>
మరిన్ని వార్తలు