కొత్త వాహన పాలసీ 2 నెలల్లో!!

9 Feb, 2018 00:49 IST|Sakshi

భారీ పరిశ్రమల మంత్రి అనంత్‌ గీతే వెల్లడి

గ్రేటర్‌ నోయిడా: కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో కొత్త వాహన పాలసీ ముసాయిదాను ప్రకటించనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా పాలసీని రూపొందిస్తామని భారీ పరిశ్రమల మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. 14వ ఆటో ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలసీ రూపకల్పనలో సియామ్, ఏసీఎంఏ సహా పరిశ్రమ ప్రతినిధుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారాయన.

‘ఎఫ్‌ఏఎంఈ స్కీమ్‌ తొలి దశ మార్చిలో ముగియనుంది. దీంతో రెండో దశపై దృష్టి కేంద్రీకరించాం. దీన్ని మరింత విజయవంతం చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. వివిధ వాహన విభాగాలపై పన్నును సవరించాలనే పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ‘పరిశ్రమ నుంచి పలు విజ్ఞప్తులు అందాయి. కొత్త పాలసీ విధానంలో వీటిని పరిష్కరిస్తాం’ అని హామీనిచ్చారు. కొత్త పాలసీ విధానం పరిశ్రమకు, వినియోగదారులకు స్నేహపూరితంగా ఉంటుందన్నారు.

పరిశ్రమ కొత్త టెక్నాలజీలను ఒడిసి పట్టుకోవాలని, బీఎస్‌–6 నిబంధనల అమలు విషయంలో సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరిశ్రమకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇక పన్ను సంబంధ సమస్యలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉందని సియామ్‌ ప్రెసిడెంట్‌ అభయ్‌ ఫిరొడియా కోరారు. వాహన పరిశ్రమలో పలు మంత్రిత్వ శాఖల ప్రమేయం ఉందని, అలాకాకుండా ప్రతిపాదిత నోడల్‌ వ్యవస్థ ‘నేషనల్‌ ఆటోమోటివ్‌ బోర్డు’ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

2020 ఏప్రిల్‌ తర్వాత కూడా బీఎస్‌–4 వాహన విక్రయాలకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటు 5%గా ఉండాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఇది 12%. అలాగే ప్యాసింజర్‌ వాహన విభాగంలో కేవలం రెండు జీఎస్‌టీ శ్లాబ్‌లు మాత్రమే ఉండాలని కోరుతోంది.  

యూఎం లోహియా: యూఎం లోహియా టూవీలర్స్‌ తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్‌ క్రూయిజర్‌ ‘రెనెగెడ్‌ థార్‌’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). కంపెనీ అలాగే రెనెగెడ్‌ డ్యూటీ ఎస్, రెనెగెడ్‌ డ్యూటీ ఏస్‌ బైక్స్‌ను ప్రదర్శకు ఉంచింది. వీటి ప్రారంభ ధర రూ.1.9 లక్షలు. ఈ రెండింటిలో 223 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.  
సుజుకీ మోటార్‌సైకిల్‌: సుజుకీ మోటార్‌సైకిల్‌ తాజాగా 125 సీసీ అడ్వాన్స్‌డ్‌ లగ్జరీ స్కూటర్‌ ‘బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌’ను ఆవిష్కరించింది. అలాగే సహా సబ్‌ 1,000 సీసీ విభాగంలో జీఎస్‌ఎక్స్‌–ఎస్‌750 బైక్‌ను ప్రదర్శించింది. కంపెనీ హయబుసా తర్వాత భారత్‌లో తయారు చేస్తోన్న రెండో పవర్‌ బైక్‌ ఈ జీఎస్‌ఎక్స్‌–ఎస్‌750నే. ఇన్‌ట్రూడర్‌ బైక్‌లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శనకు ఉంచింది.   
పినాకిల్‌: పినాకిల్‌ స్పెషాలిటీ వెహికల్స్‌ తాజాగా కస్టమైజ్‌డ్‌ లగ్జరీ ఎక్స్‌పాండబుల్‌ మోటార్‌హోమ్‌ ‘ఫినెట్‌జా’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.15–50 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. కంపెనీ అలాగే మోడిఫైడ్‌ ఎగ్జిక్యూటివ్‌ బిజినెస్‌ వ్యాన్‌ ‘ఒపిసియా’, కస్టమైజ్‌డ్‌ టూరర్‌ ‘మాగ్రిఫిసియా’, మోడిఫైడ్‌ ప్రొడక్ట్‌ డిస్‌ప్లే వ్యాన్‌ ‘ఎగ్జిబికా’లను ప్రదర్శనకు ఉంచింది.  
ఎంఫ్లుక్స్‌ మోటార్స్‌: ఎంఫ్లుక్స్‌ మోటార్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ ‘ఎంఫ్లుక్స్‌ వన్‌’ నమూనాను ఆవిష్కరించింది. ఇది 2019 ఏప్రిల్‌లో భారతీయ రోడ్లపై పరిగెత్తనుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు.  
యూనిటి: స్వీడన్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ యూనిటి తాజాగా 5 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షలు. ఇది 2020లో మార్కెట్‌లోకి రానుంది. కంపెనీ అలాగే 2 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘యూనిటి వన్‌’ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్ల అసెంబ్లింగ్, మార్కెటింగ్‌ కార్యకలాపాల కోసం బర్డ్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.   
ట్వంటీ టూ మోటార్స్‌: ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీ కంపెనీ ట్వంటీ టూ మోటార్స్‌ తాజాగా స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఫ్లో’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. దీన్ని 5 గంటలు చార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. వీటి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇవి 2018 రెండో అర్ధభాగంలో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. 
 
(ఆటోషోను ప్రారంభిస్తున్న సియామ్‌  డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌. )


(టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌310తో మోడల్‌)


(బీఎండబ్ల్యూ మినీ కూపర్‌ కన్వర్టబుల్‌ ఎస్‌)

మరిన్ని వార్తలు