ఎన్ని లెసైన్స్‌లైనా ఇస్తాం..!

3 Jul, 2013 03:03 IST|Sakshi
Chidambaram

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇచ్చే విషయంలో ఉదారంగానే వ్యవహరిస్తామంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సంకేతాలిచ్చారు. బ్యాంకుల ఏర్పాటు విషయంలో లెసైన్స్‌ల సంఖ్యపై ఎలాంటి పరిమితీ ఉండబోదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్‌లోకి వచ్చేందుకు మొత్తం 26 ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల దాఖలకు ఆర్‌బీఐ విధించిన గడువు సోమవారంతో ముగిసింది. రేసులో ఉన్న వాటిలో టాటా, బిర్లా, అంబానీల గ్రూప్‌లతో పాటు పోస్టల్ శాఖ, ఎల్‌ఐసీ హౌసింగ్ వంటి ప్రభుత్వరంగ దిగ్గజాలు ప్రధానమైనవి. ఈ నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘లెసైన్స్‌లకు సంబంధించి పరిమితి ఉంటుందని భావించడం లేదు. కచ్చితంగా ఇంతమందికే ఇవ్వాలని కూడా లేదు. దరఖాస్తు చేసిన కంపెనీల అర్హతలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అలాగని ముందుకొచ్చిన కంపెనీలన్నింటికీ అర్హత ఉన్నట్లు కాదు’ అని చిదంబరం పేర్కొన్నారు.
 
 మరిన్ని బ్యాంకులు కావాల్సిందే...
 మరోపక్క, భారత్‌కు భారీస్థాయి బ్యాంకుల అవసరం ఉందా? లేదంటే భారీ సంఖ్యలో బ్యాంకులు కావాలా? అనే ప్రశ్నకు... రెండూ అని విత్తమంత్రి సమాధానమిచ్చారు. ‘బ్యాంకుల సంఖ్య అధికంగా ఉంటే దేశంలో మారుమూల పల్లెలకూ సేవలు విస్తరించడానికి, తద్వారా సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి వీలవుతుంది. అదేవిధంగా పోటీతత్వం కూడా మరింత పెరుగుతుంది. ఇక బడా బ్యాంకుల ఆవిర్భావంతో భారీస్థాయి ప్రాజెక్టులకు నిధుల కల్పనకు దోహదపడుతుంది. విదేశీ బ్యాంకింగ్ దిగ్గజాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అందువల్ల ఈ రెండింటి అవసరం దేశానికి చాలా ఉంది’ అని చిదంబరం చెప్పారు. కాగా, అర్హత ఉన్నా దరఖాస్తుదారులందరికీ లెసైన్స్‌లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇదివరకే చెప్పడం తెలిసిందే.
 
 ఆర్థిక వ్యవస్థపై...: తయారీ రంగం అదేవిధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మందగమనానికి చికిత్స చేస్తున్నామని, గాడిలో పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు ఇతరత్రా జాప్యాలను ఎదుర్కొంటున్న కీలక మౌలికరంగ ప్రాజెక్టులను గుర్తించామని, వచ్చే కొద్ది వారాల్లో వీటికి లైన్‌క్లియర్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అయితే, దేశ ఆర్థిక సమస్యలకు తక్షణ పరిష్కారాలేవీ ఉండవన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకు కొంత సమయం పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.
 
 విదేశీ పెట్టుబడులను పెంచాల్సిందే...
 దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహం పెరగాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల మూడో వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రక్షణ, టెలికం, మల్ట్రీబ్రాండ్ రిటైల్ సహా అనేక రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితుల్లో సమూల మార్పులు అవసరమనేది ఆర్థిక శాఖ ప్రతిపాదన. దీనిపై పారిశ్రామిక విధానం, పోత్సాహక విభాగం(డీఐపీపీ) వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలను ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే క్యాబినెట్ నోట్ జారీ కానుందని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని చిదంబరం పేర్కొన్నారు.
 
 వడ్డీరేట్ల కోతపై...
 ఒక్క ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడంపైనే రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దృష్టిపెడితే కుదరదని చిదంబరం అభిప్రాయపడ్డారు. పడిపోతున్న ఆర్థిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పన గురించి కూడా ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా రానున్న పాలసీ సమక్ష(ఈ నెల 30న)లో వడ్డీరేట్ల తగ్గింపు ఆవశ్యకతను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కాగా, గతంలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ఖాతాదార్లకు అందించడంలో ప్రభుత్వరంగ బ్యాంకులు సముచితంగా వ్యవహరించాలన్నారు. బ్యాంకుల చీఫ్‌లతో బుధవారం ఆయన భేటీ కానుండటం గమనార్హం. ఆర్‌బీఐ కఠిన పరపతి విధానంపై చిదంబరం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే.
 
 కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ఖాయం
 ఎన్ని అడ్డంకులెదురైనా కోల్ ఇండియాలో 10% వాటా విక్రయం ఖాయమని విత్తమంత్రి తేల్చిచెప్పారు. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఖజానాకు రూ. 20 వేల కోట్ల నిధులు రావచ్చన్నారు. ఈ నిధులను ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరాల కోసమే వినియోగిస్తామని  ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదిత వాటా విక్రయానికి కోల్ ఇండియా కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు