జూలై 11 నుంచి రైళ్లుండవ్..!

9 Jun, 2016 13:30 IST|Sakshi
జూలై 11 నుంచి రైళ్లుండవ్..!

న్యూఢిల్లీ : వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) పిలుపునిచ్చింది. కొత్త పెన్షన్ స్కీమ్ పై రివ్యూ , ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వంటి పలు డిమాండ్ లతో రైల్వే యూనియన్లు ఈ నిరవధిక బంద్ చేపట్టనున్నాయి.  రైల్వే యూనియన్లు  గురువారం బంద్ నోటీసును
 ప్రభుత్వానికి అందజేశాయి.

అన్ని జోనల్ రైల్వేస్ జీఎంలకు, ప్రొడక్షన్ యూనిట్లకు నేడు నిరవధిక సమ్మె నోటీసులు అందనున్నాయి. ఈ నోటీసు ప్రకారం జూలై 11 ఉదయం 6గంటలనుంచి 13లక్షల మంది రైల్వే వర్కర్లు సమ్మె పాటించనున్నారని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఏడవ వేతన సిఫారసు మేరకు కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కు పెంచాలని మిశ్రా డిమాండ్ చేస్తున్నారు.   

 ఆరు నెలల క్రితం అంటే 2015 డిసెంబర్  లో తమ డిమాండ్లను తెలుపుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ పంపామని, అయితే ప్రభుత్వం స్పందించిన తీరు చాలా నిర్లక్ష్యంగా, నిరాశకంగా ఉందని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎమ్.రాఘవయ్య తెలిపారు. ఈ నిరవధిక సమ్మె కాలంలో ఎలాంటి రైల్వేలు పట్టాలపై నడవబోవని ఎన్ఎఫ్ఐఆర్ తెలిపింది. ఎన్ఎఫ్ఆర్ఐ, ఏఐఆర్ఎఫ్ రెండు యూనియన్లు ఈ నిరవధిక సమ్మెకు సంయుక్తంగా మద్దతు తెలుపుతున్నాయని, ఈ రెండు యూనియన్ల డిమాండ్లు ఒకటేనని రాఘవయ్య చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు