కేజీ బేసిన్ పరిహారంపై ఓఎన్జీసీలో భిన్న స్వరాలు

28 Sep, 2016 00:35 IST|Sakshi
కేజీ బేసిన్ పరిహారంపై ఓఎన్జీసీలో భిన్న స్వరాలు

షా కమిటీ సిఫారసును సవాల్ చేద్దాం వద్దు... ఆమోదిద్దాం
రెండుగా విడిపోయిన బోర్డు
ఆర్‌ఐఎల్ పరిహారం ప్రభుత్వానికేనన్న షా కమిటీ

న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో తమ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) బ్లాక్‌లకు తరలిపోయిన గ్యాస్‌కు సంబంధించి రూ.11వేల కోట్ల పరిహారం అడిగే విషయమై ఓఎన్‌జీసీ బోర్డు రెండుగా విడిపోయింది. దీనిపై ఏర్పాటైన జస్టిస్ ఏపీ షా కమిటీ గత నెలలో కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయిన గ్యాస్‌పై పరిహారం ప్రభుత్వానికే వెళుతుందని, ఓఎన్‌జీసీకి రాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్యాస్ ప్రభుత్వానిదే కనుక పరిహారానికీ ప్రభుత్వమే అర్హురాలని తెలిపింది. తాజాగా ఇదే అంశంపై ఓఎన్‌జీసీ బోర్డులో రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం.

భిన్న స్వరాలు:విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... బోర్డులోని ఒక వర్గం షా కమిటీ ప్రతిపాదనను సవాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. వివాద పరిష్కారమై సంతృప్తి చెందకపోతే కోర్టును తిరిగి ఆశ్రయించవచ్చని ఢిల్లీ హైకోర్టు అవకాశం ఇచ్చింది కనుక కోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. ఇదే వర్గం మరో పాయింట్‌ను కూడా లెవనెత్తుతోంది. కేజీ డీ6 బ్లాక్‌కు ఆర్‌ఐఎల్ కూడా యజమాని కాదని, పెట్టుబడులపై రాబడి మీద నిర్ణీత శాతం మేర చెల్లిస్తోందన్న లాజిక్‌ను షా కమిటీ విస్మరించిందని వాదిస్తోంది. మరో వర్గం మాత్రం ప్రభుత్వంతో పోరాడడం సరికాదని, కేజీ బేసిన్‌లో గ్యాస్ ఆర్‌ఐఎల్ బేసిన్‌కు వెళుతోందన్న విషయాన్ని నిరూపించామని, షా కమిటీ సిఫారసులను ఆమోదించాలని కోరుతోంది. మరోవైపు పెట్రోలియం శాఖ ఆర్‌ఐఎల్ ఎంత పరిహారం చెల్లించాలన్న అంశాన్ని తేల్చాల్సిందిగా డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)ను కోరింది. ఈ నేపథ్యంలో చివరికి ఈ అంశం ఏమని తేలుతుందో ఆసక్తికరంగా మారింది.

 పూర్వాపరాలు:కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు... ఆర్‌ఐఎల్‌కు కేజీ- డీడబ్ల్యూఎ - 98/3 లేదా డీ6 బ్లాక్ పక్కపక్కనే ఉన్నాయి. తమ బ్లాక్‌ల నుంచి ఆర్‌ఐఎల్ గ్యాస్ తరలించుకుపోతోందని ఓఎన్‌జీసీ తొలిసారిగా 2013లో గుర్తించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. స్పందన లేకపోవడంతో ఓఎన్‌జీసీ 2014 మేలో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. దీనిలో ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చింది. ఆర్‌ఐఎల్ కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించిన 2009 ఏప్రిల్ 1 నుంచి... 2015, మార్చి 31 మధ్య కాలంలో 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్‌ఎం సైతం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో తేల్చింది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు.

మరిన్ని వార్తలు