ఫ్యాషన్ అడ్డా.. రోపోసో!

30 Apr, 2016 01:37 IST|Sakshi
ఫ్యాషన్ అడ్డా.. రోపోసో!

ఒకే వేదికగా కొనుగోళ్లు.. రివ్యూ సేవలు
మనకు నచ్చిన ఫ్యాషన్స్ ట్రెండ్స్, పోస్ట్‌లు చేసే వీలు
నచ్చితే అక్కడికక్కడే కొనుగోలు చేసే అవకాశం
200కు పైగా సెలబ్రిటీలు రోపోసో కస్టమర్లే
21 మిలియన్ల డాలర్ల నిధుల సమీకరణ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్లని అనుకరిస్తే నలుగురిలో ట్రెండీగా కనిపించొచ్చు.. అదే ఫ్యాషన్లపై ఇష్టం పెంచుకుని అప్‌డేట్ చేసుకుంటే! అభిరుచి కొనసాగడంతో పాటు ఆదాయాన్నీ ఆర్జించొచ్చు!!

..ఇదే రోపోసో ఫౌండర్ల వ్యాపార సూత్రం. దీంతో సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ ఫ్యాషన్స్ పాఠాలు నేర్పించే స్థాయికి ఎదిగింది. ఇతర సంస్థల్లా కేవలం ఉత్పత్తుల అమ్మకాలకే పరిమితమైతే కొంత మందినే చేరుకుంటామని... అదే రోపోసోను ఫ్యాషన్లకు సామాజిక మాధ్యమంలా మార్చేస్తే ఎంతో మందికి చేరువవ్వొచ్చనే వినూత్న ఆలోచనతో ప్రారంభమైన స్టార్టప్ ఇది. రోపోసో సేవల గురించి సంస్థ కో-ఫౌండర్ మయాంక్ ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి చెప్పింది ఆయన మాటల్లోనే...

 ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇద్దరు మిత్రులు అవినాశ్ సక్సేనా, కౌశల్ సుభాంక్‌తో కలిసి రూ.40 లక్షల పెట్టుబడితో 2014 జూలైలో గుర్గావ్ కేంద్రంగా రోపోసో.కామ్‌ను ప్రారంభించాం. రోపోసో అంటే రిలవెంట్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఫ్యాషన్లకు దగ్గరగా అని అర్థం. రోపోసో రెండు రకాల సేవలందిస్తుంది. 1. సోషల్ నెట్‌వర్కింగ్ 2.యాడ్స్

సోషల్ నెట్‌వర్కింగ్‌లో మనకు నచ్చిన ఫ్యాషన్స్ ట్రెండ్స్, స్టోరీలు, రివ్యూలు, సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేయొచ్చు.
యాడ్స్‌లో.. ఆయా ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. ప్రస్తుతం రోపోసోలో అపెరల్స్, ఫుట్‌వేర్, యాక్ససరీలు... ఇలా 5 వేల బ్రాండ్లకు చెందిన 60 లక్షల ఉత్పత్తులున్నాయి.

 400 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం...
ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్లపై అవగాహన కల్పించడం, వాటిలో ఏవి మనకు నప్పుతాయో చెప్పేందుకు రోపోసోను సోషల్ నెట్‌వర్కింగ్ వేదికగా వినియోగించుకోవచ్చు. అంటే మనకు నచ్చిన ఫ్యాషన్స్ గురించి, సెల్ఫీ వీడియోలు, పోస్ట్‌లు, స్టోరీలు దీన్లో పోస్ట్ చేయొచ్చు. మన పోస్ట్‌లు ఇతరులకు నచ్చితే ఆయా ఉత్పత్తులను ఎక్కడైతే కొనుగోలు చేశామో అక్కడి నుంచి కొనుగోలు చేయటానికి రోపోసోనే వేదికగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం అమెజాన్, జబాంగ్, స్నాప్‌డీల్ వంటి సుమారు 400 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేస్తే ఆయా కంపెనీలు 15-20 శాతం వరకు కమీషన్ రూపంలో మాకు చెల్లిస్తాయి. ఇదే మా రెవెన్యూ విధానం.

 సెలబ్రిటీలూ మా యూజర్లే..
రోపోసో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లతో పాటు, డెస్క్‌టాప్‌లోనూ ఉంది. ఇప్పటివరకు 25 లక్షల మంది మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో 20 లక్షల మంది యాక్టివ్ యూజర్లు. వారానికి 5 లక్షల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 200లకు పైగా యూజర్లు సెలబ్రిటీలే. సోనాక్షి సిన్హా, నర్గిస్ ఫక్రి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శిల్పాశెట్టి, సానియా మీర్జా, బిపాసా బసు, రీచా చందా, ఈషా గుప్తా వంటివారెందరో ఉన్నారీ జాబితాలో.

 21 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ..
రెండు రోజుల క్రితమే సిరీస్ బీ రౌండ్‌లో భాగంగా ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీ బెర్తెల్స్‌మన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ (బీఐఐ) రోపోసోలో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో రోపోసో టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం 120 మంది ఉద్యోగులున్నారు. మరికొందరిని నియమిస్తాం. ఉత్పత్తుల సంఖ్యనూ పెంచుతాం. ఈ పెట్టుబడులతో కలిపి మేం ఇప్పటిదాకా 21 మిలియన్ డాలర ్లను సమీకరించాం. రెండేళ్ల వరకూ వ్యాపార విస్తరణ, అభివృద్ధిపై దృష్టిపెడతాం. ఆ తరవాతే తదుపరి రౌండ్ నిధుల సేకరణకు వెళతాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు