హైదరాబాద్‌ కుర్రాడి ‘ఆసీ టికెట్‌’

6 Nov, 2018 02:08 IST|Sakshi

స్పోర్ట్స్, ఈవెంట్స్‌ బుకింగ్‌కు ఆన్‌లైన్‌ వేదిక

ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఫండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాశం భరత్‌రెడ్డికి చక్కగా సరిపోతుంది. సొంతగడ్డపై రెండు కంపెనీలు ఏర్పాటు చేసి... విజయవంతంగా నడిపిస్తున్న భరత్‌రెడ్డి... టీ–హబ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాడు.

సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌లో చేరి... అక్కడా వ్యాపారావకాశాలు వెదికాడు. ఆస్ట్రేలియాలో వ్యవస్థీకృతంగా స్పోర్ట్, ఈవెంట్స్‌కు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునే పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారంగా మార్చి  ‘ఆసీ టికెట్‌’ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. దీనికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫండ్‌ రూపంలో సాయం చేసింది కూడా!!. కంపెనీ విశేషాలు ఆయన మాటల్లోనే..

వారికి పెద్ద ఉపశమనం..
వీకెండ్‌ వచ్చిందంటే ఆస్ట్రేలియాలో అత్యధికులు సైక్లింగ్, బోటింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, మోటార్‌ రేసెస్, క్రికెట్, ఫుట్‌బాల్‌ వంటి క్రీడల్లో మునిగిపోతారు. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే టికెట్లు ఆన్‌లైన్‌లో కొనుక్కునే అవకాశం లేకపోవడం.

క్రీడా స్థలంలోనే టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియా ప్రభుత్వ సిడ్నీ స్టార్టప్‌ హబ్‌లో మా ప్రణాళికను వారి ముందుంచాం. మా బ్లూ ప్రింట్‌ చూసి వారు మెచ్చుకున్నారు. రూ.10 లక్షల సీడ్‌ ఫండ్‌ సమకూర్చారు. భవిష్యత్తులో మరింత ఫండ్‌ దక్కే అవకాశమూ ఉంది. మా సేవల ద్వారా ఇప్పుడు స్థానికులకు పెద్ద ఉపశమనం లభించనుంది.  

నవంబరులో పూర్థి స్థాయిలో..
ఇప్పటి వరకు పైలట్‌ ప్రాజెక్టు నిర్వహించాం. విజయవంతంగా పలు ఈవెంట్ల టికెట్లు విక్రయిం చాం. నవంబరు 26న ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ ఉంది. దీనికోసం మూడో వారంలోనే యాప్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ యాప్‌ కూడా హైదరాబాద్‌లోని మా కంపెనీలో రూపుదిద్దుకుంటోంది.

డిసెంబరులో పెద్ద ఎత్తున ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లున్నాయి. మంచి సీజన్‌ కూడా. ఇది మాకు కలిసి వస్తుంది. ఆసీటికెట్‌.కామ్‌లో ఐదుగురు సభ్యులం పనిచేస్తున్నాం. హైదరాబాద్‌ టీహబ్‌లో మేం ఏర్పాటు చేసిన సంక్రంక్‌ గ్రూప్, ఇండియాఈలెర్న్‌ సంస్థల్లో ప్రస్తుతం 18 మంది పనిచేస్తున్నారు’’ అని భరత్‌రెడ్డి వివరించారు.

>
మరిన్ని వార్తలు