బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...

7 Dec, 2023 13:43 IST|Sakshi

బంగారం ఆర్థికంగా ఆపదలో ఆదుకుంటుందని అందరూ చెబుతారు. అవసరాలకు డబ్బు అందనపుడు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి అప్పు తెస్తుంటారు. ప్రైవేటు వ్యాపారులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి.

అయితే ఇతర సంస్థలు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు బంగారం తనఖాపై తక్కువే రుణం ఇస్తుంటాయి. అయినా తమ సొమ్మకు భరోసా ఉంటుందని భావించి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. సదరు బ్యాంకులో దురదృష్టవశాత్తు నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖాపెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరనే ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే  ఓ బ్యాంకు అధికారి ఇలా తనఖా పెడుతున్న బంగారానికి సంబంధించి భద్రత ఎవరిపై ఉంటుందనే అంశాలను వెల్లడించారు. 

తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ‘సేఫ్‌’లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్‌ ఇన్‌ఛార్జి (క్లర్క్‌) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్‌ తాళాలు ఇద్దరి దగ్గరే ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు ఇతరులకు తాళాన్ని ఇస్తే తప్పా సొత్తును అపహరించడం కష్టం.

 ఇదీ చదవండి: భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..!

బ్యాంకు శాఖల్లో ఆడిట్‌ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్‌లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపంచకుండాపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుని.. దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారని సీనియర్‌ అధికారి వివరించారు.

>
మరిన్ని వార్తలు